పల్నాడు: జిల్లా కలెక్టరేట్‌లో శనివారం నాడు ఒక్కసారిగా కలకలం రేగింది. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) స్థాయిలోని ఓ ఉన్నతాధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. క్యాటరింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు లక్షల్లో లంచం డిమాండ్ చేసిన డీఆర్వో ఏకా మురళిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అసలేం జరిగింది?
వివరాల్లోకి వెళ్తే.. 2023లో జరిగిన ఒక భారీ ప్రభుత్వ కార్యక్రమం కోసం `సాగరమాత క్యాటరింగ్ సర్వీసెస్` వారు సుమారు 41,000 భోజన పార్శిళ్లను సరఫరా చేశారు. ఇందుకు సంబంధించి సుమారు రూ.37 లక్షల బిల్లు ప్రభుత్వానికి సమర్పించగా, రూ.10 లక్షలు అడ్వాన్స్ రూపంలో అందాయి. మిగిలిన రూ.26 లక్షల బకాయిలను విడుదల చేయాలని కాంట్రాక్టర్ డీఆర్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే, సదరు చెక్కును ప్రాసెస్ చేయాలంటే తనకు రూ. 3 లక్షలు లంచం ఇవ్వాలని డీఆర్వో మురళి తెగేసి చెప్పారు.
అడిగినంత ఇచ్చుకోలేక, అధికారి వేధింపులు భరించలేక సదరు కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అడిషనల్ ఎస్పీ గుంటూరు మహీందర్ బృందం పక్కా ప్లాన్ వేసింది. శనివారం నాడు డీఆర్వో కార్యాలయంలో మురళి ఆ లంచం డబ్బును తీసుకుంటుండగా అధికారులు మెరుపు దాడి చేశారు. ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా లేకుండా మురళిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారి ఇలా లంచం తీసుకుంటూ దొరికిపోవడంతో కలెక్టరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.