మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన `మన శంకర వరప్రసాద్ గారు` బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం రెండు వారాల్లోనే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరుతుండటంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే, ఈ వేడుకలో సినిమా సక్సెస్ కంటే కూడా కాస్టింగ్ కౌచ్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
సినీ రంగంలో ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉన్న కాస్టింగ్ కౌచ్ అంశంపై చిరంజీవి చాలా సూటిగా, స్పష్టంగా స్పందించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదు అని తేల్చి చెప్పిన ఆయన, పరిశ్రమను ఒక అద్దంతో పోల్చారు. మనం అద్దం ముందు నిలబడి ఎలా ప్రవర్తిస్తే, ప్రతిబింబం కూడా అలాగే ఉంటుంది. ఇండస్ట్రీ కూడా అంతే.. మనం ఎలా బిహేవ్ చేస్తే, రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మగ పిల్లలైనా, ఆడ పిల్లలైనా టాలెంట్‌తో వస్తే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి అని హితవు పలికారు.
సాధారణంగా ఇలాంటి సున్నితమైన అంశాలపై సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ మెగాస్టార్ ఈసారి చాలా బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ``ఇక్కడ ఎవరి వర్కింగ్ స్టైల్ వారిది. ఎవరైనా ఇండస్ట్రీ బాలేదు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని అంటున్నారంటే.. అది వారి ప్రవర్తనలో ఉన్న తప్పిదమే అవుతుంది తప్ప, ఇండస్ట్రీది కాదు`` అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత క్రమశిక్షణ, ప్రవర్తన బాగుంటే సినీ రంగంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.