స్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్‌.. మ‌రి ఆ 52 రోజుల సంగ‌తేంటి?

admin
Published by Admin — February 02, 2026 in Politics
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఏడాది కాలంగా ప్రకంపనలు సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. చంద్రబాబు నాయుడు గారిపై మోపిన అవినీతి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేల్చి చెప్పింది. తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంతో, ఆయనపై మోపినవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులేనన్న వాదనకు బలం చేకూరింది. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే.. తప్పు లేదని తేలినప్పుడు, ఒక మాజీ ముఖ్యమంత్రిని 52 రోజుల పాటు జైల్లో ఉంచిన ఆ అక్రమ అరెస్టుకు బాధ్యులు ఎవరు?

స్కిల్ కేసు పేరుతో అర్థరాత్రి పూట హైడ్రామా నడుమ చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు, దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ఆ నిధులన్నీ విదేశాలకు వెళ్లాయని సీఐడీ అధికారులు ఆరోపించారు. కానీ, క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసిన కేంద్ర సంస్థ ఈడీ మాత్రం.. నిధుల మళ్లింపులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే అప్పట్లో వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కథ అల్లారనేది ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారింది.

ఆ 52 రోజుల వేదనకు జవాబుదారీ ఎవరు?
ఎటువంటి పక్కా సాక్ష్యాలు లేకుండా 73 ఏళ్ల వయసున్న ఒక సీనియర్ నాయకుడిని రిమాండ్ పేరుతో జైల్లో ఉంచడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. ఆ 52 రోజులు ఆయన అనుభవించిన మానసిక వేదన, ఆయన కుటుంబం పడ్డ ఇబ్బందులు, పార్టీ క్యాడర్‌లో నెలకొన్న ఆందోళన.. వీటన్నింటికీ పరిహారం ఏది? జవాబుదారీ ఎవరు? కేవలం పైస్థాయి నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ, చట్టాలను వక్రీకరించి తప్పుడు కేసులు బనాయించిన అధికారుల తీరు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. కేవలం రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా సాగిన ఈ ప్రక్రియలో చట్టం తన పని తాను చేసుకుపోవడానికి బదులు, కొందరి చేతిలో అస్త్రంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అక్రమ అరెస్టులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ఖైదీగా మిగిలిపోయే ప్రమాదం ఉంద‌న్న అభిప్రాయాలు బ‌లంగా వినిపిస్తున్నాయి.

Tags
Skill Development Case CM Chandrababu Naidu ED CBN Andhra Pradesh Ap Politics
Recent Comments
Leave a Comment

Related News