మంగళగిరి: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో పార్టీ కేడర్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగం ఆద్యంతం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ``ప్రతి చిన్న విషయానికి, ప్రతి విమర్శకు నేనే సమాధానం చెప్పాలా? మరి మీరు ఎందుకు ఉన్నట్టు?`` అంటూ ఆయన ఫైర్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని జనసేన నేతలు బలంగా తిప్పికొట్టలేకపోతున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలు విసిరే ఉచ్చులో పడొద్దని, ముఖ్యంగా మహిళా నేతలపై చేసే వ్యక్తిగత విమర్శలకు లొంగిపోవద్దని హితవు పలికారు. ఆధారాలతో సహా వైసీపీ తప్పులను ఎండగట్టండి.. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో మాట్లాడండి తప్ప, భయపడకండి అని నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని విశ్రాంతి తీసుకుంటే కుదరదని, క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగించాలని స్పష్టం చేశారు.
అధికార కూటమిలో ఉన్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా ఇతర పార్టీ నేతలపై లేదా ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని పవన్ కఠినంగా ఆదేశించారు. కూటమి లక్ష్యాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ గౌరవాన్ని పెంచేలా ప్రవర్తించాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా ఉండాలని సూచించారు.
టార్గెట్ 2026: గ్రామ స్థాయి నుంచి ప్రక్షాళన
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పవన్ కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీని కేవలం పట్టణాలకే పరిమితం చేయకుండా, ప్రతి గ్రామంలోనూ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జనసేన జెండా ప్రతి ఇంటిపై ఎగరాలని, అప్పుడే పార్టీకి బలమైన పునాది ఏర్పడుతుందని ఆయన కేడర్‌కు ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గానికి పరిమితం కాకుండా, పార్టీ బలోపేతానికి కూడా సమయం కేటాయించాలని ఆదేశిస్తూ పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.