తెలంగాణ మున్సిపల్ రిజల్ట్స్: గెలిచిన కొత్త బాస్‌లు వీళ్లే!

admin
Published by Admin — February 16, 2026 in Politics, Telangana
News Image

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల పర్వం ఎట్టకేలకు ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆయా వార్డుల విజేతలు మున్సిపల్ కార్యాలయాల్లో కొలువుదీరారు. తాజాగా జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికతో పట్టణ పాలనలో కొత్త అంకం మొదలైంది. పలు చోట్ల కాంగ్రెస్ తన హవా చాటగా, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. మరి మీ ఏరియా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న కొత్త బాస్ ఎవరో ఓ లుక్కేసేయండి.

ఉమ్మడి పాలమూరు & రంగారెడ్డి జిల్లాలు:
పాలమూరు జిల్లా రాజకీయాల్లో ఈసారి ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్గనూర్ బసవేశ్వరు, వైస్ చైర్మన్‌గా అందే మోహన్ బాధ్యతలు చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తన సత్తా చాటింది. ఇక్కడ చైర్మన్‌గా సీఎం సురేష్, వైస్ చైర్మన్‌గా మాల నరసింహులు ఎన్నికయ్యారు. ఇక ఆలంపూర్ చైర్మన్‌గా పిండి జయరాములు (బిఆర్ఎస్), వైస్ చైర్మన్‌గా ఎరుకలి విక్రమ్ పగ్గాలు చేపట్టారు. నారాయణపేట జిల్లా కోస్గి చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి నాగులపల్లి నరేందర్ ఎన్నికయ్యారు.

ఉమ్మడి మెదక్ & సంగారెడ్డి జిల్లాలు:
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మెదక్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. చైర్‌పర్సన్‌గా కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్‌గా దొంతి నరేష్ ఎన్నికయ్యారు. అయితే తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. ఇక్కడ చైర్‌పర్సన్‌గా బొంది రజిని రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్‌గా సమతా రెడ్డి ఎన్నికయ్యారు. సదాశివపేట చైర్‌పర్సన్‌గా అంజమ్మ బాధ్యతలు స్వీకరించారు. ఇక కోహీర్ మున్సిపాలిటీలో MIM మరియు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్ పీఠాన్ని దక్కించుకుంది. ఇక్కడ చైర్మన్‌గా ఎం. అశోక్, వైస్ చైర్మన్‌గా మొహమ్మద్ అబ్దుల్ జావీద్ ఎన్నికయ్యారు.

ఉమ్మడి కరీంనగర్ & ఆదిలాబాద్:
జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా తిరుమల వసంత ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. మరోవైపు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బండారి అనూష ఎన్నికయ్యారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో కాంగ్రెస్ అభ్యర్థి అక్కి శ్రీనివాస్ గౌడ్ చైర్మన్‌గా విజయం సాధించారు.

మొత్తానికి వార్డు కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం నుంచి చైర్మన్ల ఎన్నిక వరకు సాగిన ఈ సుదీర్ఘ ప్రక్రియ నేటితో ముగిసింది. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరు మధ్య కొత్త పాలకమండళ్లు ఏర్పడ్డాయి. మ‌రి కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈ బాస్‌లు తమ పట్టణాల అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తారో వేచి చూడాలి.

Tags
Telangana Municipal Results Telangana Elections 2026 Municipal Bosses Telangana Politics BRS Congress
Recent Comments
Leave a Comment

Related News