హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అరెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తార్నాకలోని ఆయన నివాసం వద్ద ఉదయం నుంచే హైడ్రామా నడిచింది. శాంతిభద్రతల సాకుతో పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేయగా, ఆ తర్వాత బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది.
అసలేం జరిగింది?
గత కొద్దిరోజులుగా బాన్సువాడలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బాధితులను పరామర్శించేందుకు రామచందర్ రావు సిద్ధమయ్యారు. మరోవైపు, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని బీజేపీ ఆరోపిస్తోంది. తన పార్టీ ఎమ్మెల్యేపై దాడి జరగడాన్ని నిరసిస్తూ, అక్కడి పరిస్థితులను కూడా సమీక్షించేందుకు రామచందర్ రావు బయలుదేరగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పీక్స్‌కు చేరింది. ఈ క్రమంలో ఉదయం నుంచి రామచందర్ రావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు.. ఆ తర్వాత అరెస్ట్ చేశారు.
రామచందర్ రావు అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు తెరలేపిందని ఆయన మండిపడ్డారు. ``ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచారన్న కక్షతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు`` అంటూ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం, నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముదురుతున్న పొలిటికల్ వార్..!
తాజా అరెస్టులతో తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ యుద్ధం ముదిరింది. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని బీజేపీ హెచ్చరిస్తుంటే, మరోవైపు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ అరెస్ట్ పర్వం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.