రాజకీయం అంటేనే విచిత్రం. అది ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో.. ఎప్పుడు ఎవరిని ఉడికిస్తుందో చెప్పడం కష్టం. నాడు వైసీపీ హయాంలో ఫిర్యాదుల వీరుడుగా పేరు తెచ్చుకున్న మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. చంద్రబాబును ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా అప్పట్లో ఆయన వేసిన అడుగులు.. ఇప్పుడు ఆయనకే రివర్స్ గేర్ వేస్తున్నాయి.
సాధారణంగా ఎవరైనా బాధితులు ఉంటేనే కేసు పెడతారు. కానీ ఆర్కే స్టైలే వేరు. అమరావతిలో ఎస్సీ రైతుల భూములు అక్రమంగా లాక్కున్నారంటూ ఏ ఒక్క రైతు ఫిర్యాదు చేయకపోయినా.. రైతుల బాధ నా బాధ అంటూ ఆయనే బాధితుడిగా మారి కేసులు పెట్టారు. తీరా ఇప్పుడు సీఐడీ లోతుగా ఆరా తీస్తే.. అక్కడ సీన్లో అసలు సాక్ష్యాలే లేవని తేలిపోయింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు అంటూ ఆయన చేసిన ఆరోపణలన్నీ ఇప్పుడు గాలిలో దీపాల్లా మారాయి.
నాడు కోర్టు మెట్లు ఎక్కుతూ బిజీగా ఉన్న ఆర్కే, ఇప్పుడు తన ఇంటి తలుపు తట్టిన ఏసీబీ అధికారులను చూసి షాక్ తిన్నారట. ``సాక్ష్యాలు లేవు.. ఆధారాలు లేవు.. ఈ కేసులను ఎందుకు మూసివేయకూడదో చెప్పండి`` అంటూ అధికారులు హైదరాబాద్లోని ఆర్కే నివాసానికి వెళ్లి నోటీసులు చేతిలో పెట్టారు. ఫలితంగా చంద్రబాబును బోనులో నిలబెట్టాలని ఆశపడ్డ ఆర్కే.. ఇప్పుడు తానే 27వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టులో బోను ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
అప్పట్లో వైసీపీ పెద్దల మెప్పు కోసం చంద్రబాబుపై వరసపెట్టి కేసులు వేసిన ఆర్కేకు ఈ నెల 27వ తేదీన విజయవాడలోని ఏసీబీ కోర్టుకు హాజరుకావాలని అధికారులు డెడ్లైన్ విధించారు. సాక్ష్యాలు లేనందున ఈ కేసులను ఎందుకు మూసివేయకూడదో ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బలమైన ఆధారాలు కోర్టు ముందు ఉంచని పక్షంలో, ఫిర్యాదుదారుడిగా ఆయన ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మొత్తానికి నాడు చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని చూసిన ఆయుధాలే, ఇప్పుడు ఆర్కే కొంపముంచేలా కనిపిస్తున్నాయి.