మేగజైన్ స్టోరీ: మెడికల్‌ కాలేజీలకు ‘జగన్‌’ గ్రహణం!

admin
Published by Admin — February 22, 2026 in Andhra
News Image

సొంతంగా వైద్య కళాశాలలు నిర్మించడానికి ప్రభుత్వం వద్ద నిధుల్లేవు. కేంద్రం కూడా పూర్తిస్థాయిలో సాయం చేయడం కష్టం. అందుకే పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందులలో నాలుగు మెడికల్‌ కాలేజీలు కట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

ఇందుకు కేంద్రం నుంచీ గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దీనికి మోకాలడ్డుతున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం పెట్టిన కఠినతర నిబంధనలతో ఏ కంపెనీ కూడా టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. ఏపీఎంఎస్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) పిలిచిన టెండర్లల్లో ఆదోని మెడికల్‌ కాలేజీకి మాత్రమే బిడ్‌ దాఖలైంది.

అది కూడా ఒకే ఒక్క సంస్థ (హైదరాబాద్‌కు చెందిన కిమ్స్‌) వేసింది. మిగిలిన మూడు కాలేజీలకు ఎవరూ బిడ్‌ వేయలేదు. పీపీపీ పద్ధతిలో మెడికల్‌ కాలేజీల అభివృద్ధికి ఎవరైనా ముందుకొస్తే.. తాను గద్దెనెక్కాక జైలుపాల్జేస్తానని జగన్‌ బెదిరించడంతో కిమ్స్‌ కూడా వెనక్కి తగ్గింది. దీంతో ఏం చేయాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పాలుపోవడం లేదు.

ఈ నిబంధనలతో కంపెనీలెలా వస్తాయ్‌?

జగన్‌ బెదిరించినంత మాత్రానే కంపెనీలు మెడికల్‌ కాలేజీలపై వెనక్కి తగ్గలేదు. టెండర్‌ డాక్యుమెంట్‌లో చాలా కఠినమైన నిబంధనలున్నాయి. పైగా అవి వాటికి నష్టం చేకూర్చేలా ఉన్నాయి. ఏదైనా కంపెనీ ఒక ప్రాజెక్టుపై రూ.వందల కోట్లు పెట్టుబడి పెడితే.. భవిష్యత్‌లో ఎంత ఆదాయం వస్తుందోననే అంశంపైనే దృష్టి పెడతాయి. తక్షణం రాబడి రాకపోయినా కనీసం నష్టపోకూడదన్న ఆలోచనలో ఉంటాయి. కానీ ఏపీఎంఎస్‌ఐడీసీ పిలిచిన టెండర్‌ డాక్యుమెంట్‌లో నిబంధనలు కంపెనీలకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయన్న విమర్శలున్నాయి.

మెడికల్‌ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ 150 ఎంబీబీఎస్‌, 24 మెడికల్‌ పీజీ సీట్లు అందుబాటులోకి తీసుకురావాలి. ఆయా సీట్లకు అనుగుణంగా భారతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం భవనాలు నిర్మించాలి. అలానే 625 పడకల ఆస్పత్రిని రెండేళ్లల్లో నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అందులో 70 శాతం పడకలను ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ ద్వారా పేద ప్రజలకు కేటాయించాలి.

పేదలకు కేటాయించిన పడకల్లో ఉచితంగా వైద్య సేవలు అందించాలి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి నిర్మాణానికి కంపెనీలు రూ.600 కోట్లకు పైనే సొంత నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టే సంస్థకు తక్షణం వచ్చే ఆదాయం ఏమీ లేకపోగా.. ప్రభుత్వం నుంచి కూడా సరైన సహకారం అందడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇదే విషయాన్ని ప్రి-బిడ్‌ మీటింగ్‌లో పాల్గొన్న కంపెనీలు పదే పదే ప్రస్తావించాయి. వాటి ఒత్తిడితో.. కాలేజీ ప్రారంభించిన తర్వాత రెండేళ్ల పాటు ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆంగీకరించింది. ఇది తప్ప నిర్వహణ సంస్థలకు తన నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం ఉండదని తేల్చేసింది. దీంతో పీపీపీ మెడికల్‌ కాలేజీల టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. నాలుగు మెడికల్‌ కాలేజీలకు గాను ఆదోని కాలేజీకి మాత్రమే బిడ్‌ దాఖలైందని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం సింగిల్‌ బిడ్డర్‌ని ఎంపిక చేయడానికి అవకాశం లేదు. దరిమిలా నాలుగు కాలేజీలకు రెండోసారి టెండర్లకు వెళ్లాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

జగన్‌ శాపం..

అయితే కేవలం ఆదాయం ఉండదనే కంపెనీలు పీపీపీ విధానంలో నాలుగు మెడికల్‌ కాలేజీల నిర్వహణకు ముందుకు రావడం లేదంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే పీపీపీ విధానంలో కంపెనీలకే అనుకూలంగా నిబంధనలుంటాయి. మరి ఎందుకవి ముందుకు రాలేదు? దీనివెనుక జగన్‌ బ్లాక్‌మెయిల్‌ రాజకీయం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. పీపీపీకి వెళ్లే 4 కాలేజీల్లో పులివెందుల కూడా ఉంది. అంటే జగన్‌ సొంతూరు. దీని టెండర్లలో ఆయన సన్నిహితులిద్దరు బిడ్‌ దాఖలుకు ప్రయత్నించారు.

 బీజేపీకి సన్నిహితుడైన కర్ణాటకకు చెందిన కాంట్రాక్టరు కూడా రంగంలోకి వచ్చారని.. గాలి జనార్దన్‌రెడ్డి ద్వారా, అక్కడి ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ద్వారా ఒత్తిడి చేయించి ఆయన్ను ఇటు రాకుండా అడ్డుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తన సన్నిహితులకు టెండర్‌ కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సుముఖంగా లేదని తెలియడంతో.. అది ఇవ్వాలనుకున్న సంస్థను జగన్‌ అండ్‌ కో బెదిరించి పులివెందుల కాలేజీకి బిడ్‌ దాఖలు కాకుండా చేసినట్లు తెలిసింది.

ఆదోని కాలేజీ టెండర్‌ నుంచి కిమ్స్‌ వైదొలగడం వెనుక కూడా మాజీ సీఎం కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మార్కాపురం, మదనపల్లె కాలేజీల నిర్మాణం, నిర్వహణకు వైసీపీతో పాటు టీడీపీ మద్దతుదారులు కూడా మొదట ఆసక్తి చూపారు. అయితే ఉన్నతాధికారులు పర్సెంటీలు డిమాండ్‌ చేయడంతో వారు ఆదిలోనే మానుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీలు కట్టడాన్ని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు దిగుతోంది.

దీనికి ప్రభుత్వం నుంచి గానీ, టీడీపీ నుంచి గానీ గట్టిగా కౌంటర్‌ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ మరింత రెచ్చిపోతోంది. పైగా టెండర్లలో పాల్గొనే కంపెనీలకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. ప్రభుత్వం మీ వెనుకే ఉందన్న కనీస హామీ కూడా ఇవ్వడం లేదు. వాస్తవానికి ప్రి-బిడ్‌ సమావేశానికి ఐదు కంపెనీలు హాజరయ్యాయి. బిడ్లు వేయడానికి సిద్ధమయ్యాయి కూడా. అయితే జగన్‌కు తాబేదార్లయిన కొందరు ఉన్నతాధికారుల తీరుతో చివరి నిమిషంలో అవి వెనక్కి తగ్గినట్లు తెలిసింది.

ఇది తెలిసిన బీజేపీకి చెందిన వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం దృష్టికే గాక.. తమ పార్టీ నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉండడంతో.. పీపీపీ విధానానికి మద్దతుగా లేఖ కూడా రాశారు. అయినా కంపెనీలు జంకుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కలుగజేసుకుని.. కంపెనీల ఆందోళనలను కారణాలు తెలుసుకుని నిబంఽధనలను సడలిస్తే తప్ప రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి అవకాశం ఉండదు.

అన్ని డిమాండ్లకూ అంగీకరించినా..

వాస్తవానికి కంపెనీలు అడిగిన మినహాయింపులన్నిటికీ సర్కారు అంగీకరించింది. ప్రధానంగా ప్రభుత్వం కేటాయించిన భూమిలో మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రితో పాటు నర్సింగ్‌, డెంటల్‌, పారా మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని అవి కోరాయి. దీనికి ప్రభుత్వంసరేనంది. బిడ్‌ దాఖలు చేసే సమయంలో మూడు కంపెనీలతో కన్సార్షియంగా మారేందుకు అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తినీ అంగీకరించింది.

రెండేళ్ల పాటు సిబ్బంది జీతభత్యాలు ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌కు కూడా ఆమోదం తెలిపింది. మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి నిర్మాణంలో మాత్రమే ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్‌ను పాటించాలని.. మిగిలిన భవనాలను తమకు నచ్చినట్లు కంపెనీలు నిర్మించుకోవచ్చంటూ వెసులుబాటు సైతం కల్పించింది. అయితే కాలేజీకి కేటాయించిన భూములను తనఖాపెట్టి రుణాలు తీసుకుంటామన్న వాటి వినతిని మాత్రమే తిరస్కరించింది. దీనికి ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని ముందే తెలియడంతో ఈ కారణంగానే అవి వెనక్కి తగ్గాయంటే నమ్మశక్యంగా లేదు.

జగన్‌ మద్దతుదారులైన అధికారులే వారిని బెదరగొట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని... మళ్లీ మూడున్నరేళ్ల తర్వాత జగనే అధికారంలోకి వస్తారని.. ఆయన టెండర్లను రద్దుచేయడం ఖాయమని భయపెట్టడంతో ఆ ఐదు కంపెనీలు మౌనంగా ఉండిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడచినా పలు శాఖల మాదిరిగా వైద్య ఆరోగ్య శాఖలో తిష్ఠ వేసిన వైసీపీ మద్దతుదారులను చంద్రబాబు పక్కన పెట్టకపోవడం వల్లే తాజా ఇబ్బందికర పరిణామానికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags
Medical colleges jagan eclipse ycp ppp cm chandrababu
Recent Comments
Leave a Comment

Related News