తెలంగాణలో ఎమ్మెల్యేల బాహాబాహి

admin
Published by Admin — January 12, 2025 in Politics
News Image

తెలంగాణలో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి చాలాకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ తో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యే..ఏ పార్టీ నీది..అంటూ ఏక వచనంతో సంజయ్ ను కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

మాటా మాటా పెరిగి ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లింది. సంజయ్ పై దాడి చేసేందుకు కౌశిక్ రెడ్డి పైపైకి దూసుకు వచ్చారు. దీంతో, పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత సంజయ్ పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారని, తనది కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నారని విమర్శించారు. దమ్ముంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు.

కేసీఆర్ పెట్టిన భిక్ష వల్ల సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చూస్తూ ఉండబోమని అన్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను కచ్చితంగా నిలదీస్తామని, అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూసినా భయపడే ప్రసక్తే లేదని అన్నారు. కొంతమంది అధికారులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని, మూడేళ్ల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ఈ రోజు అతి చేస్తున్న అధికారులను ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

Recent Comments
Leave a Comment

Related News

Latest News