అవసరానికి మించి చెలరేగిపోవటం.. ఉత్త పుణ్యానికే విరుచుకుపడటం లాంటి అంశాలతో తరచూ వార్తల్లోకి వస్తున్నారు గులాబీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. గతంలో పలు కేసులు ఉన్నప్పటికీ.. ఈ మధ్యన జరిగిన బీఆర్ సీ సమావేశ వేళ.. ఎమ్మెల్యే సంజయ్ మీద చేయి చేసుకోవటం.. దురుసుగా వ్యవహరించటం లాంటివి తెలిసిందే. ఈ ఉదంతానికి సంబంధించి ఆయనపై మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బీఆర్ఎస్ తరఫు పోటీ చేసిన సంజయ.. కాంగ్రెస్ తీర్థం తీసుకోవటం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సంజయ్ పై దూషణలకు దిగారు.
ఈ సందర్భంగా ఆయనపై దూసుకొచ్చిన కౌశిక్ రెడ్డి తీరును కంట్రెల్ చేయాలన్న అభిప్రాయం సర్వత్రా వినిపించింది. రివ్యూ సమావేశంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి అవసరం లేకున్నా.. రాజకీయాల్ని తెర మీదకు తీసుకురావటంపై గందరగోళంతో పాటు.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం తెలిసిందే.
ఈ ఘటనకు సంబంధించి ఆర్డీవో మహేశ్వర్.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పాడి కౌశిక్ రెడ్డిని.. సోమవారం రాత్రి అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. హైదరాబాద్ లోని ఒక టీవీ చానల్ కు వెళ్లి.. లైవ్ లో మాట్లాడి బయటకు వస్తున్న వేళలో ఆయన్ను అదుపులోకి తీసుకొన్న కరీంనగర్ పోలీసులు.. నేరుగా కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడే అధికారులు కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు.