వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఎప్పుడో కానీ ప్రభుత్వ ప్రకటనలు కనిపించేవి కావు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు అయితే మరీ అరుదు. ఈనాడు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ కాబట్టి కొన్ని ప్రభుత్వ ప్రకటనలు అనివార్యంగా ఇవ్వక తప్పదు కానీ.. పార్టీ ప్రకటనలైతే అందులో కనిపించేవి కావు. జిల్లా ఎడిషన్లలో అయినా కింది స్థాయి నాయకులు రీచ్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో ప్రకటనలు ఇస్తారు కానీ.. రాష్ట్ర స్థాయిలో మాత్రం పార్టీ ప్రకటనలు ఆ రెండు మీడియాల్లో ఉండవు. ఇక సాక్షిలో తెలుగుదేశం పార్టీ ప్రకటనల విషయంలోనూ ఇంతే. ఆ పత్రికలో ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిన కంపల్షన్ లేదు. ఇక రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రకటనలైతే ఇన్నేళ్లలో ఒకటీ అరా కూడా వచ్చి ఉండవేమో. ఈ నేపథ్యంలో తాజాగా సాక్షి పత్రికలో ఫుల్ పేజీ టీడీపీ యాడ్ దర్శనమివ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ నుంచి గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చి నెల్లూరు ఎంపీగా గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ భారీ ప్రకటన ఇచ్చారు. అన్ని మీడియాలతో పాటే ఆయన సాక్షికి కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం సభ్యత్వ నమోదు కోటి దాటిన నేపథ్యంలో ఎన్టీఆర్ వర్ధంతి రోజైన శనివారం ఈ ప్రకటన ఇచ్చారు వేమిరెడ్డి. ఆయన ఈ ప్రకటనను సాక్షికి ఇవ్వాలనుకోవడం ఒకెత్తయితే.. ఈ యాడ్‌ను సాక్షి యాజమాన్యం స్వీకరించడం మరో ఎత్తు. రెండూ ఊహించని పరిణామాలే.
సాక్షిలో టీడీపీ యాడ్ చూసి వైసీపీ అభిమానులంతా షాక్ తిని ఉంటారనడంలో సందేహం లేదు. అదే సమయంలో టీడీపీ వాళ్లకు కూడా ఇది పెద్ద షాకే. ఎప్పుడూ టీడీపీ వినాశనం కోసం ప్రయత్నించే సాక్షికి ఇంత పెద్ద యాడ్ ఇచ్చి ఆర్థిక ప్రయోజనం చేకూర్చడం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తుంటే.. ఇందులో తప్పేమీ లేదని కొందరు టీడీపీ మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.