బీజేపీలోకి చిరంజీవి.. కిషన్ రెడ్డి కామెంట్స్ వైర‌ల్‌!

admin
Published by Admin — January 19, 2025 in Politics
News Image

చిరంజీవి బీజేపీలోకి వెళ్ల‌బోతున్నారా..? మెగాస్టార్ ను త‌మ పార్టీలోకి చేర్చుకునేందుకు కమలం పార్టీ ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తుందా..? అన్న చ‌ర్చే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు.. త‌మ్ముడు పొత్తు పెట్టుకున్న బీజేపీతో చిరు స‌న్నిహితంగా న‌డుచుకుంటున్నారు. బీజేపీ నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీనికి తోడు రీసెంట్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ప్ర‌త్యేక వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.

ఈ వేడుక‌ల్లో దేశ‌ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు మెగాస్టార్ చిరంజీవి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. చిరంజీవికి మోదీ ఎంతో ప్ర‌ధాన్య‌త ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చిరంజీవి బీజేపీలో చేరుతున్నారంటూ ప్ర‌చారం ఊపందుకుంది. ప్రముఖుల కోటాను ఉపయోగించి బీజేపీ పెద్ద‌ల చిరంజీవిని రాజ్యసభకు పంపవచ్చనే ఊహాగానాలు కూడా తెర‌పైకి వ‌చ్చాయి అయితే తాజాగా ఈ విష‌యంపై కిష‌న్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.

శ‌నివారం మీడియాతో కిష‌న్ రెడ్డి చిట్-చాట్ చేశారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి బీజేపీలో చేరుతున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. కిష‌న్ రెడ్డి ఆ ప్ర‌చారాన్ని ఖండించారు. చిరంజీవితో త‌న‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. తామిద్దరం ఒకరినొకరు కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాం. ఆయ‌న‌పై ఉన్న గౌర‌వంతోనే పండ‌గ వేడ‌కుల‌ను ఆహ్వానించామ‌ని కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఆయ‌న కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

కాగా, చిరంజీవి పొలిటిక‌ల్ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. టాలీవుడ్ లో నెం.1గా ఉన్న టైమ్‌లో ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశారు. 2009 ఎన్నికలకు ముందు ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించారు. నాటి ఎన్నికల్లో ప్ర‌జారాజ్యం పోటీ చేసిన‌ప్ప‌టికీ.. ఆ పార్టీకి 18 సీట్లే ద‌క్కాయి. సొంత పార్టీ పెట్టుకుని అనుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోలేక‌పోయిన చిరంజీవి.. ప్ర‌జారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆపై కాంగ్రెస్ త‌ర‌ఫున కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు. రాష్ట్ర విభజన అనంత‌రం పాలిటిక్స్ ను వీడి సినిమాల బాట ప‌ట్టారు. ఇక‌ చిరుకు సాధ్యం కానిది ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సాధించ‌డంతో.. మ‌ళ్లీ మెగాస్టార్ రాజ‌కీయాల‌పై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

 
Recent Comments
Leave a Comment

Related News