జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద చిల్లర కోసం వెతుక్కోవడం, క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూడటం ఇక గతం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల వద్ద నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇకపై మీ జేబులో నగదు ఉన్నా.. టోల్ ఫీజు చెల్లించాలంటే మాత్రం డిజిటల్ మార్గమే శరణ్యం.
ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం, ఇంధన వృధాను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. టోల్ ప్లాజాల(Toll Plaza) వద్ద వాహనాలు ఆగి, నగదు చెల్లించి, తిరిగి చిల్లర తీసుకునే ప్రక్రియ వల్ల విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. దీనివల్ల వాయు కాలుష్యంతో పాటు ప్రయాణికుల సహనానికి పరీక్ష ఎదురవుతోంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, పూర్తిస్థాయిలో క్యాష్ లెస్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
రేపటి నుంచి ప్రయాణించే వారు తమ వాహనానికి ఫాస్టాగ్ (FASTag) ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ ఫాస్టాగ్ లేకపోయినా లేదా అందులో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు తప్పవు. అటువంటి వాహనాలకు భారీగా జరిమానా విధించడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో ప్లాజా దాటకుండా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రయాణానికి ముందే రీఛార్జ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
సాంకేతిక కారణాల వల్ల లేదా నెట్‌వర్క్ ఇష్యూస్ వల్ల ఫాస్టాగ్ స్కాన్ కాకపోతే, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రత్యామ్నాయంగా ప్రతి టోల్ బూత్ వద్ద యూపీఐ(QR Code) సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మీ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తక్షణమే ఫీజు చెల్లించి ముందుకు సాగవచ్చు. అయితే, హైవేలపై కొన్నిచోట్ల సిగ్నల్ సమస్యలు ఉండవచ్చు కాబట్టి, ముందస్తు జాగ్రత్తగా మీ ఫాస్టాగ్ ఖాతాను బ్యాంకుతో లింక్ చేసి యాక్టివ్‌గా ఉంచుకోవడం అత్యంత సురక్షితం. డిజిటల్ ఇండియా దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో వాహనదారులు కూడా సహకరించి, ప్రయాణానికి ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో.. రేపు హైవే ఎక్కే ముందు మీ స్మార్ట్ ఫోన్, ఫాస్టాగ్ రెడీగా ఉన్నాయో లేదో చూసుకోండి.