తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత(late jayalalitha) అభిమానులకు షాకింగ్ ఘటన చోటు చేసుకుం ది. జయలలిత నివాసాన్ని(house) గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్(sieze) చేశారు. వాస్తవానికి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. అక్కడే రాజకీయాలు చేసినప్పటికీ.. ఆమెకు ఉమ్మడి ఆంధ్రాలోని హైదరాబాద్, కర్ణాటకలోని బెంగళూరు, కేరళలోని తిరువనంతపురం, పుదుచ్చేరి, యానాం, ఢిల్లీ, సిమ్లాలలో స్థిరాస్తులు ఉన్నాయి.
హైదరాబాద్ శివారులో ద్రాక్ష తోటలు కూడా ఉన్నాయి. వీటి నుంచి వస్తున్న ద్రాక్ష.. హైదరాబాద్ వాసుల నోటిని తీపిచేస్తోందంటే ఆశ్చర్యం వేస్తుంది. అయితే.. జయ మరణాంతరం.. కస్టోడియన్‌గా ఉన్న ఆమె నెచ్చెలి శశికళను కోర్టు తొలగించింది. జయ ఆస్తుల బాధ్యతలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించిం ది. గతంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండడంతో ఆమె ఆస్తులను పర్యవేక్షించేవారు. కానీ.. తర్వాత కాలంలో ప్రభుత్వం మారడంతో డీఎంకే పాలకులు.. కస్టోడియన్ బాధ్యతలను పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని శ్రీనగర్‌లో ఉన్న సువిశాల బంగళా కు సంబంధించిన ఆస్తి పన్నును చెల్లించలేదు. దీనిపై గత నెల నుంచి అధికారులు నోటీసులు ఇస్తున్నారు. అధికారుల లెక్క ప్రకారం.. మొత్తం 83 లక్షల రూపాయల మేరకు ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంది. మొత్తం 4 అంతస్థుల ఈ భవనం ప్రస్తుతం ఖాళీగానే ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్నాళ్ల పాటు ఆమె మేనల్లుడు దీపక్ నివాసం ఉన్నారు. కాగా.. పన్ను బకాయి విషయాన్ని వారు తమిళనాడు ప్రభుత్వానికి చేరవేశారా లేదా? అనే విషయాన్ని అధికారులు తెలపాల్సి ఉంది.
నోటీసులో ఏం పేర్కొన్నారంటే!
``మాజీముఖ్యమంత్రి జయలలితకు సంబంధించి ఇంటికి ఆస్తి పన్ను బకాయి ఉంది. 2017 నుంచి చెల్లించలేదు. మొత్తం 83 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. ఆమెకు సంబంధించివారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఈ క్రమంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న జీ+4 భవనాన్ని సీజ్ చేశాం`` అని పేర్కొన్నారు.