ఒక్క పెయింటింగ్ రూ. 167 కోట్లు.. ఇండియాలోనే కాస్ట్లీ బొమ్మ ఇది!

admin
Published by Admin — April 02, 2026 in National
News Image

కళకు వెలకట్టలేం అంటారు.. కానీ ఆ కళాఖండం సృష్టించిన చరిత్రను చూస్తే మాత్రం నోరెళ్లబెట్టక తప్పదు. భారతీయ చిత్రకళా చరిత్రలో ఇప్పటివరకు వినని, కనని రీతిలో ఒక పెయింటింగ్ ఏకంగా రూ. 167.2 కోట్లకు అమ్ముడై సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్(M.F. Husain) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేస్తూ, భారతీయ చిత్రకళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది ఈ అరుదైన పెయింటింగ్.

ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ 1890వ దశకంలో గీసిన ఈ ఆయిల్‌ పెయింటింగ్‌లో యశోదమ్మ తన చిన్ని కృష్ణుడిని అపురూపంగా చూసుకుంటున్న దృశ్యం ఉట్టిపడుతుంది. ముంబయిలో జరిగిన `సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్`(Saffronart Spring Live Auction)లో ఈ చిత్రం వేలానికి రాగా, పారిశ్రామికవేత్తలు, కళాభిమానులు దీని కోసం భారీగా పోటీపడ్డారు. చివరికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా ఈ అరుదైన కళాఖండాన్ని రికార్డు స్థాయిలో రూ. 167.2 కోట్లు వెచ్చించి దక్కించుకున్నారు.

గతేడాది ఎం.ఎఫ్. హుస్సేన్ గీసిన పెయింటింగ్ రూ. 118 కోట్లకు అమ్ముడై అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే, ఏడాది తిరగకముందే రవివర్మ సృష్టించిన ఈ మాస్టర్ పీస్ ఆ రికార్డును దాదాపు రూ. 50 కోట్ల భారీ వ్యత్యాసంతో అధిగమించింది. ``ఈ పెయింటింగ్‌ను దక్కించుకోవడం నాకెంతో గౌరవంగా అనిపిస్తోంది. భారతీయ వారసత్వాన్ని కాపాడుకోవడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను`` అని పూనావాలా(Cyrus Poonawalla) ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఎందుకింత ధర?
రాజా రవివర్మ(Raja Ravi Varma) చిత్రాలంటేనే ఒక ప్రత్యేకత. పాశ్చాత్య సాంకేతికతను, భారతీయ సంప్రదాయ ఇతివృత్తాలను మేళవించడంలో ఆయన సిద్ధహస్తులు. ముఖ్యంగా ఈ యశోద-కృష్ణుల చిత్రంలో రంగుల వాడకం, భావోద్వేగాలు సజీవంగా ఉండటం వల్ల దీనికి ఇంత భారీ ధర పలికిందని నిపుణులు చెబుతున్నారు. వందేళ్ల క్రితం నాటి ఈ అపురూప చిత్రం ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ఖరీదైన కాస్ట్లీ బొమ్మగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.

Tags
Raja Ravi Varma Saffronart’s Spring Live Auction Mumbai Cyrus Poonawall MF Husain
Recent Comments
Leave a Comment

Related News