లండన్ కు చెందిన ఒక ఐటీ ఉద్యోగిని పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారన్న ఫిర్యాదు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు రావటం.. దీనిపై కేసు నమోదు చేయటం తెలిసిందే. రూ.9.35 కోట్లు కాజేసినట్లుగా అందులో ఆరోపించారు. అదే సమయంలో ఆమె నమ్మించి మోసం చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో తన న్యాయవాదుల టీంతో క్యాష్ పిటిషన్ ను దాఖలు చేశారు అషురెడ్డి. తనపై తదుపరి చర్యల్ని నిలిపివేయాలని కోరారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని.. అప్పటివరకు పోలీసుల చర్యపై స్టే విధించాలని అభ్యర్థించారు.
ఇందుకు తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ తమ నిర్ణయాల్ని వెలువరించారు. ఇందులో ప్రధానంగా పేర్కొన్న అంశాల్ని చూస్తే.. ఈ కేసు విచారణ నిలిపి వేసేందుకు కానీ.. పోలీసు చర్యలపై స్టే ఇవ్వటానికి హైకోర్టు నో చెప్పింది. అదే సమయంలో ఆమెపై బలవంతపు చర్యలు తీసుకోకుండా మాత్రం రక్షణ చర్యల్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో అషు రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లేలా.. అవాస్తవ కథనాలను ప్రసారం చేయకూడదంటూ సోషల్ మీడియాతో పాటు ఇతర మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే వండి వార్చిన కథనాలు.. పాత వివాదాస్పద కంటెంట్ ను తొలగించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్ని.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రిపోర్టును తమకు సమర్పించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో పోలీసులు సమర్పించే పూర్తి వివరాల్ని పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెబుతూ క్యాష్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది.
అషురెడ్డిపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందటం.. కేసు కట్టటం తదితర పరిణామాల నేపథ్యంలో సుమారు ముప్ఫైకు పైగా మీడియా సంస్థలు.. సోషల్ మీడియా వేదికలను హైకోర్టు నియంత్రిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఈకేసుకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ లో తనకు మే వరకు గడువు ఇస్తే రూ.1.5 కోట్లు తిరిగి ఇస్తానని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని ప్రామాణికతను పోలీసులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో హైకోర్టుకు పోలీసులు సమర్పించే కౌంటర్ అఫిడవిట్ అనంతరమే కీలక పరిణామాలు చోటు చేసుకునే వీలుందని చెప్పొచ్చు.
ఇక.. హైకోర్టు స్టే ఇవ్వటం ద్వారా అషురెడ్డికి దక్కే ఊరట ఏంటి? అదే సమయంలో బలవంతపు చర్యలు లేవని కోర్టు చెప్పిన మాటను ఎలా చూడాలి? అన్నది చూస్తే...ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. బలవంతపు చర్యలు తీసుకోకూడదన్న హైకోర్టు ఆదేశాల్ని చూస్తే.. ఈ కేసులో ఆమెకు అరెస్టు ముప్పు తప్పిందని చెప్పాలి. క్వాష్ పిటిషన్ ద్వారా ఆమె పొందిన పెద్ద ఊరటగా చెప్పాలి. అదే సమయంలో ఆమెపై కేసు నమోదు నేపథ్యంలో ఇష్టారాజ్యంగా.. ఉన్నది లేనిది కలిపి వండేసే కథనాల వంటకాలకు షాకిచ్చే ఆదేశాల్ని కోర్టు నుంచి తెచ్చుకోవటం ద్వారా.. చట్టపరమైన.. న్యాయస్థానాల్లో ఈ కేసుకు సంబంధించిన పరిణామాల్ని మాత్రమే కవర్ చేయాల్సి ఉంటుంది. ఊహాజనిత కథనాలకు చెక్ పెట్టినట్లుగా చెప్పాలి. ఇది కూడా ఆమెకు పెద్ద ఊరటగానే చెప్పొచ్చు,
తెలంగాణ హైకోర్టులో ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను పూర్తిగా రద్దు చేయాలని కోరినా.. హైకోర్టు అందుకు నో చెప్పటం ఆమెకు ఇబ్బందే. అంతే.. ఆమెపై నమోదైన కేసు సజీవంగా ఉన్నట్లే. పోలీసుల విచారణకు స్టే ఇవ్వలేదు. అంటే.. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తమ విచారణను కొనసాగించొచ్చు. ఈ నేపథ్యంలో ఆమెను ఎప్పుడైనా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే వీలుంది. అదే సమయంలో పోలీసుల విచారణకు సంబంధించిన వారు కోరిన అంశాలను సమర్పించాల్సి ఉంటుంది.
మొత్తంగా చూస్తే.. అరెస్టు ముప్పు తప్పినప్పటికి.. కేసు విచారణను ఆమె ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆమె తరఫు వాదనల్ని ప్రముఖ న్యాయవాది వి. మురళీ మనోహర్ ఆయన టీం సభ్యులు వాదనలు వినిపించారు. ప్రైవసీ.. డిగ్నిటీ లాంటి రాజ్యాంగపరమైన హక్కుల విషయంలో బలమైన వాదనలు వినిపిస్తారన్న పేరు ఆయకు ఉంది. అందుకు తగ్గట్లే.. అషు రెడ్డి కేసులో రైట్ టు ప్రైవసీ అంశాన్ని ప్రస్తావించి మీడియా ప్రసారాలపై స్టే తెచ్చుకోవటంలో సక్సెస్ అయ్యారు. అయితే.. పోలీసుల నుంచి వచ్చే తదుపరి నివేదిక ఆధారంగానే ఆమె భవిష్యత్తు తేలుతుందని చెప్పాలి.