బిగ్ బాస్ ఫేమ్, నటి ఆషు రెడ్డి పేరు గత కొన్ని రోజులుగా ఎలా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ధర్మేంద్ర అనే ఎన్నారైని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తన నుంచి డబ్బు, బంగారం కలిపి రూ.9 కోట్లకు పైగా టోకరా వేసినట్లుగా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆషు రెడ్డి కుటుంబ సభ్యులకు పలు దఫాలుగా డబ్బులు పంపిన వివరాలను కూడా ధర్మేంద్ర సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఆమెను దోషిలాగే చూస్తున్నారు.
ఈ వ్యవహారంలో తన వాదనను ఇప్పటిదాకా ఆషు బలంగా వినిపించలేదు. తన గురించి మీడియాలో వార్తలు ఆపాలని.. తన మీద కేసులు నమోదు కాకుండా చూడాలని పిటిషన్లు వేసినా ఫలితం లేకపోయింది. తాజాగా ఆషును మరింత ఇరుకున పెట్టే సాక్ష్యాలను ధర్మేంద్ర వైపు నుంచి బయటికి వచ్చాయి.
ధర్మేంద్ర, ఆషురెడ్డి ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటి ఫొటోలు సో్షల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇప్పటిదాకా జస్ట్ పెళ్లి విషయంలో ఒక మాట అనుకున్నారని మాత్రమే అందరూ భావిస్తూ వచ్చారు. కానీ అధికారికంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారని ఈ ఫొటోలను బట్టి అర్థమవుతోంది. దీంతో ఆషు మీద సోషల్ మీడియా దాడి మరింత తీవ్రమైంది. ధర్మేంద్రకు సపోర్ట్ కూడా పెరుగుతోంది. మరోవైపు ధర్మేంద్రను పెళ్లి పేరుతో మోసం చేసిన కేసు విషయమై కోర్టులోనూ ఆషుకు చుక్కెదురైంది.
ఆషు తల్లి యశోదరెడ్డిపై దర్యాప్తు నిలిపివేయాలని కోరిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అంతే కాక తమపై కఠిన చర్యల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఆషు రెడ్డి అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. ఆధారాలు పక్కాగా ఉండడంతో ఆషు రెడ్డి ఈ కేసులో బాగానే ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి తన వెర్షన్ వినిపించడానికి ఆషు రెడ్డి ప్రెస్ మీట్ పెడుతుందని వార్తలు రాగా.. ఆమె ఆ పని చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది.