అంతర్జాతీయంగా ముంచుకొస్తున్న చమురు సంక్షోభం, దేశీయంగా పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోవాలని, బంగారం కొనుగోళ్లు ఆపాలని సూచిస్తుండగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Ragul Gandhi) మాత్రం దేశం ఎదుర్కోబోయే అసలు ముప్పును ముందే హెచ్చరించారు. ప్రధాని కేవలం పైపైన పొదుపు సూత్రాలు చెబుతుంటే, రాహుల్ గాంధీ క్షేత్రస్థాయిలో సామాన్యుడికి కలగబోయే నష్టాన్ని వివరించడంతో.. అసలు దేశ ఆర్థిక పరిస్థితిపై ఎవరికి సరైన అవగాహన ఉందనే ప్రశ్న తలెత్తుతోంది.
రాహుల్ గాంధీ ప్రధానంగా దేశ యువతను, చిన్న వ్యాపారులను ఉద్దేశించి తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ప్రధాని మోదీ(PM Modi) చెబుతున్నట్లుగా ఇది కేవలం తాత్కాలిక చమురు కొరత కాదని, త్వరలోనే దేశంలో పెను ఆర్థిక సంక్షోభం రాబోతోందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాల వల్ల దేశ సంపద అంతా అంబానీ, అదానీ వంటి కొద్దిమంది కార్పొరేట్ దిగ్గజాల చేతుల్లోకి వెళ్తోందని, సామాన్య ప్రజలు మాత్రం దారిద్ర్యంలోకి కూరుకుపోతున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రజలను పొదుపు పాటించమని చెబుతున్న ప్రధాని, తానేమో విదేశీ పర్యటనలు చేస్తూ కాలం గడుపుతున్నారని, ఈ విధానాల వల్ల దేశంలో కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోతుందని ఆయన అంచనా వేశారు.
చమురు ధరల(Fuel Prices) పెంపు అనేది కేవలం వాహనాల వాడకానికే పరిమితం కాదు.. అది నిత్యావసరాల ధరలను ఆకాశానికి చేస్తుందనే పచ్చి నిజాన్ని రాహుల్ గాంధీ బలంగా వినిపించారు. చమురు భారం పెరిగితే దేశంలో రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఫలితంగా కూరగాయల నుంచి పచారీ సామాగ్రి వరకు ప్రతిదీ ప్రియమవుతుంది. ఇప్పటికే గ్యాస్ ధరల భారంతో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిన్న చిన్న దుకాణదారులు, హోటళ్లు, బేకరీల యజమానులు వ్యాపారాలు సాగించలేక బోర్డులు తిప్పేస్తున్నారు. ఒకవైపు ఉపాధి కోల్పోతున్న చిరు వ్యాపారులు, మరోవైపు వ్యయ నియంత్రణ పేరుతో ఐటీ రంగంలో జరుగుతున్న ఉద్యోగాల తొలగింపులు దేశాన్ని పెను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి.
ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ద్వారా దేశానికి పెట్టుబడులు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో తక్షణ ఉపశమనం ఎక్కడా కనిపించడం లేదు. రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవడం, సామాన్యుడి కొనుగోలు శక్తి క్షీణించడం వల్లే ఆర్థిక చక్రం నెమ్మదించింది. పెరిగే జీవన వ్యయానికి, స్థిరంగా ఉండే ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. అందుకే ఈ క్లిష్ట సమయంలో కేవలం దేవుడిపై భారమేయడం కాకుండా.. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వంటి ప్రపంచ నాయకుల వ్యూహాలు మరియు అంతర్జాతీయ రాజకీయాలు భారత్‌కు అనుకూలంగా మారాలని, అప్పుడే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కగలమని ఆర్థిక నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.