చిత్ర పరిశ్రమలో ఎంత పెద్ద సినిమా అయినా సరే, సరైన పబ్లిసిటీ లేకపోతే బాక్సాఫీస్ వద్ద చతికిలపడటం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్స్‌గా ఉన్న కొన్ని సినిమాలు జూన్ నెలలో వరుసగా థియేటర్లలోకి వచ్చేందుకు క్యూ కట్టాయి. అందులో జూన్ 4న రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'పెద్ది'(Peddi) ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను వేటాడటం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అయితే, ఈ భారీ చిత్రం తర్వాత వారం రోజుల వ్యవధిలోనే సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’, అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కానీ, రిలీజ్ డేట్స్ దగ్గరపడుతున్నా ఈ రెండు సినిమాల మేకర్స్ ప్రమోషన్ల విషయంలో వింత మౌనాన్ని ఆశ్రయించడం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఈ సైలెన్స్ వెనుక బలమైన వ్యూహాలే ఉన్నాయని టాక్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్‌లతో ప్రేక్షకులంతా టీవీలకే అతుక్కుపోయే సమయమిది. ఇలాంటి టైమ్‌లో ప్రమోషన్లు చేసినా పెద్దగా రీచ్ ఉండదని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు, జూన్ 4న వస్తున్న 'పెద్ది' సినిమా ప్రచార వేగాన్ని పెంచేందుకు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బజ్ పరంగా ఎలాంటి ఢోకా లేకపోయినప్పటికీ, ముఖ్యంగా నార్త్ మార్కెట్‌లో భారీ ఓపెనింగ్స్ సాధించాలంటే ప్రమోషన్ల రూట్ మార్చాలని ‘పెద్ది’ టీమ్ డిసైడ్ అయింది. అందుకే ఈ గ్యాప్‌ను గమనించి సమంత(Samantha), అఖిల్ సినిమాలు కాస్త వెనక్కి తగ్గాయి. ఐపీఎల్ హడావుడి ముగిశాక, అంటే జూన్ రెండో వారం నుంచి ఈ రెండు సినిమాల టీమ్స్ ప్రమోషన్ల హోరును నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం.
సమంత లీడ్ రోల్‌లో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం(Maa Inti Bangaram)’ జూన్ 19న రిలీజ్ కానుంది. అప్పటికి 'పెద్ది' థియేటర్లలోకి వచ్చి మూడు వారాలు దాటుతుంది కాబట్టి, వసూళ్ల పరంగా ఎలాంటి డ్యామేజ్ ఉండదని ఈ డేట్‌ను లాక్ చేశారు. సాధారణంగా నందిని రెడ్డి సినిమాల్లో ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం సమంత కోసం కథలో గట్టి యాక్షన్ ఎపిసోడ్స్, ఫైట్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సరికొత్త ట్రీట్‌మెంట్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్‌కు ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందించాలని తండ్రి నాగార్జున స్వయంగా రంగంలోకి దిగారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్'తో అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామిగా మారి ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. నూతన దర్శకుడు మురళికిషోర్ అబ్బూరుకు అనుభవం తక్కువైనప్పటికీ, ఔట్‌పుట్ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు.