తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించిన ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలను సమీక్షించి అభినందించారు.
తాడేపల్లిలోని APNRTS కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, APNRTS అధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ రవి వేమూరు గారు, సీఈఓ శ్రీ కృష్ణమోహన్ గారు, APNRTS డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్ నాగేంద్ర బాబు అక్కిలి గారు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నారై సంక్షేమం, గల్ఫ్ కార్మికుల భద్రత, విదేశీ ఉపాధి అవగాహన కార్యక్రమాలు, నకిలీ ఏజెంట్ల నియంత్రణ, AP పోలీస్ NRI సెల్, 24 గంటల హెల్ప్‌లైన్, ప్రవాసాంధ్ర బీమా వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలో అమలు చేస్తున్న ఎన్నారై సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
మన పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి APNRTS అందిస్తున్న సేవలను అధ్యయనం చేయడం ఆనందంగా ఉందని APNRTS డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్ నాగేంద్ర బాబు అక్కిలి గారు తెలిపారు. ఇరు రాష్ట్రాల ఎన్నారై వ్యవస్థలు పరస్పర సహకారంతో కలిసి పనిచేస్తూ ప్రవాస భారతీయుల సంక్షేమానికి మరింత బలోపేతం చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.