వైసీపీ యువ నాయకుడు, నంద్యాల జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై పోలీసులు పలు కేసులు నమో దు చేశారు. మంత్రులపై దూషణలకు దిగడంతోపాటు.. లేని పోని విమర్శలు చేయడం, పరువు నష్టం కలిగించేలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలతో సిద్దార్థరెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే.. ఇవన్నీ.. 7 సంవత్సరాల లోపు జైలుకు అవకాశం ఉన్న సెక్షన్లే కావడంతో 41 ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటామని అధికారులు తెలిపారు.
రీజనేంటి?
సిద్దార్థరెడ్డి.. ఇటీవల పెట్రోలు, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మంత్రి, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక కంపెనీకి అనుమతులు ఇచ్చేందుకు ఏకంగా 45 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించా రు. తాము అధికారంలోకి వచ్చాక.. ఆ సొమ్మును కక్కిస్తామన్నారు. అంతేకాదు.. టీజీ కుటుంబం అవినీతి మయమని వ్యాఖ్యానించారు. వారు చేస్తున్న వ్యాపారాలు కూడా అవినీతి, అక్రమాలతోనే ముడిపడి ఉన్నా యన్నారు.
వాస్తవానికి ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి టీజీ వెంకటేష్ స్పందించారు. వైసీపీ నాయకుల మీసాలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా.. సిద్ధార్థరెడ్డి మరింత రెచ్చిపోయారు. ఎవరు ఎవరి మీసాలు తీస్తారో.. ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఇలా ప్రారంభమైన ఈ వివాదం.. తాజాగా మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. తమ కుటుంబం ఎంతో కష్టపడి పైకి వచ్చిందని.. తమ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ.. ఆయన స్వయంగా పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసి.. ఆధారాలను కూడా సమర్పించారు.
గతంలోనూ..
కాగా.. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాపాధికార సంస్థ(శాప్) చైర్మన్ సిద్దార్థరెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలో క్రీడా శాఖకు మంత్రిగా రోజా వ్యవహరించారు. అయితే.. ఇద్దరూ కలిసి.. 32 కోట్ల రూపాయల మేరకు ఆడుదాం ఆంధ్ర పేరుతో దోచేశారన్న కేసు ప్రస్తుతం పెండింగులో ఉంది. దీనిని సీఐడీ అధికారులు విచారించారు. ఇటీవల కొన్నాళ్ల కిందట.. రోజా, బైరెడ్డి అరెస్టు ఖాయమని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఏం జరిగిందో ఏమో.. ఆ కేసు అటకెక్కింది.