కష్టపడేది మేం.. పదవులు వాళ్లకా.. కోనసీమ వైసీపీలో రచ్చ!

admin
Published by Admin — May 22, 2026 in Politics, Andhra
News Image

గత ఎన్నికల పరాజయం నుంచి కోనసీమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Konaseema YSRCP) ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదు. ఒకవైపు ఓటమి నేర్పిన పాఠాలతో జిల్లాలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలని కొందరు సీనియర్లు ప్రయత్నిస్తుంటే, మరోవైపు అంతర్గత విభేదాలు, అసమ్మతి రాగాలు పార్టీని నిలువునా ముంచేలా ఉన్నాయి. జిల్లాలో ఒక రాజ్యసభ సభ్యుడు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ.. గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం క్యాడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. ఎంత కష్టపడినా గుర్తింపు లేదని, పార్టీ మొత్తం ఒకే ఒక్క కుటుంబం చుట్టూ తిరుగుతోందన్న భావన ద్వితీయ శ్రేణి నాయకుల్లో బలంగా నాటుకుపోయింది.

ఒకప్పుడు కోనసీమ రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్(Pinipe Viswarup) ప్రస్తుతం అనారోగ్య కారణాలతో యాక్టివ్ పాలిటిక్స్‌కు కాస్త దూరంగా ఉంటున్నారు. కానీ, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఆయన పదవి మాత్రం అలాగే ఉంది. అటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఆయన కుమారుడు పినిపే శ్రీకాంత్ బాధ్యతలు చూస్తున్నారు. అయితే శ్రీకాంత్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి లోకల్‌గా పార్టీ గ్రాఫ్ పడిపోతోందన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకునేందుకు మాజీ ఎంపీ చింతా అనురాధ నియోజకవర్గంలో రూట్ మార్చారు. ప్రస్తుతం అమలాపురం వైసీపీ క్యాడర్ అంతా ఆమె వెంటే నడుస్తుండటంతో, అక్కడ పాత-కొత్త నాయకుల మధ్య కోల్డ్ వార్ పీక్స్‌కు చేరింది.

శ్రీకాంత్ కేవలం అమలాపురం(Amalapuram) అసెంబ్లీకే పరిమితం కావడంతో, విశ్వరూప్ బాధ్యతల్లో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇది చాలదన్నట్టు, ఇప్పుడు పక్కనే ఉన్న పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంపై కూడా ఈ ఫ్యామిలీ కన్నేసిందన్న ప్రచారం జోరందుకుంది. రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అమలాపురం జనరల్ సీటుగా మారే అవకాశం ఉందన్న ముందస్తు ప్లాన్‌తోనే.. ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్న గన్నవరంలో తమకు అనుకూలమైన ఒక మండల స్థాయి నాయకుడిని ఇన్‌ఛార్జ్‌గా కూర్చోబెట్టారని టాక్. ఈ ముందస్తు స్కెచ్‌పై స్థానిక నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు జిల్లాలోని కీలక నేతల పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిని బలవంతంగా రాజోలు పంపడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కూడా పార్టీ కార్యక్రమాలకు మొక్కుబడిగా హాజరవుతూ సైలెంట్ అయిపోయారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు, కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్ లాంటి హేమాహేమీలు జిల్లాలో ఉన్నప్పటికీ.. ఎవరి గ్రూపులు వారివే అన్నట్లుగా సాగుతోంది. నేతల మధ్య సమన్వయ లోపం, ఒకే కుటుంబానికి పెద్దపీట వేయడం లాంటి పరిణామాలు కోనసీమ వైసీపీ(YCP)ని భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బ తీసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags
Dr. B.R. Ambedkar Konaseema AP Politics Andhra Pradesh YSRCP AP News Konaseema
Recent Comments
Leave a Comment

Related News