ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు మైకుల ముందు విమర్శలు, ప్రతివిమర్శలతో హీటెక్కించే సీన్ కాస్తా.. ఇప్పుడు సైలెంట్ ఆపరేషన్స్ వైపు షిఫ్ట్ అయింది. ముఖ్యంగా టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అనుసరిస్తున్న సరికొత్త వ్యూహాలు ప్రత్యర్థి పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ఆయన పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఎక్కడా హడావుడి లేదు, అనవసర ప్రకటనలు లేవు.. కానీ క్షేత్రస్థాయిలో ఆయన వేస్తున్న అడుగులు మాత్రం పక్కా టార్గెట్‌ను రీచ్ అవుతున్నాయి. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత పటిష్టమైన కంచుకోటగా భావించే ఉమ్మడి కడప జిల్లాపై లోకేష్ పూర్తి ఫోకస్ పెట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక ఏ పార్టీ అయినా కాస్త రిలాక్స్ అవుతుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి కడప(Kadapa) జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 7 స్థానాలను టీడీపీ కూటమి కైవసం చేసుకుని చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. అయినా సరే, లోకేష్ మాత్రం అస్సలు అలసత్వానికి తావివ్వడం లేదు. ప్రత్యర్థి లీడర్లలాగా సోషల్ మీడియాలోనో, ప్రెస్ మీట్లలోనో సవాళ్లు విసరడం కాకుండా.. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను ఎలా బలోపేతం చేయాలనే దానిపైనే ఆయన నిశ్శబ్దంగా వర్క్ చేస్తున్నారు. అవతలి పార్టీ ఎంత బలహీనపడినా, తమ ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకోవాలనేదే ఆయన అసలు ప్లాన్.
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను లోకేష్ ఒక సవాల్‌గా తీసుకున్నారు. గతంలో అధికార బలంతో సాగిన ఏకగ్రీవాలకు, బెదిరింపు రాజకీయాలకు ఈసారి చెక్ పెట్టాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ప్రతి గ్రామంలోనూ ప్రజాదరణ ఉన్న బలమైన నాయకులను గుర్తించి, వారిని బరిలోకి దించే బాధ్యతను జిల్లా ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించారు. ఈ నిశ్శబ్ద వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోందో ఎన్నికల ఫలితాలు వస్తే గానీ వైసీపీ(YCP)కి అర్థం కాని పరిస్థితి నెలకొంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) సొంత జిల్లా కావడంతో అక్కడ వైసీపీకి ఇంకా కొంతవరకు క్యాడర్ యాక్టివ్‌గా ఉంది. అందుకే అక్కడ ప్రతిపక్షానికి కోలుకునే గ్యాప్ కూడా ఇవ్వకూడదని లోకేష్ భావిస్తున్నారు. జిల్లాలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడంతో పాటు, గత ఐదేళ్లలో వేధింపులకు గురైన క్షేత్రస్థాయి టీడీపీ కార్యకర్తలకు తాము ఉన్నామనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరుస్తూనే.. రాజకీయంగా ప్రత్యర్థి కోటను పూర్తిగా బద్దలు కొట్టేలా లోకేష్ రచిస్తున్న ఈ నిశ్శబ్ద చదరంగం ఇప్పుడు కడప జిల్లా పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది.