ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ప్రజాస్వామ్య పండుగకు పునాది పడింది. మీ చేతిలో ఉన్న అత్యంత పవర్‌ఫుల్ పొలిటికల్ వెపన్ 'ఓటు' ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అవును, రాష్ట్రంలో ఓటర్ల లిస్ట్‌ను క్లీన్ చేసే భారీ ఆపరేషన్‌కు తెరలేచింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర ప్రక్షాళన ప్రక్రియ జెట్ స్పీడ్‌తో ఊపందుకుంది. మన ఓటు లిస్ట్‌లో సేఫ్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకోకపోతే.. రేపు పోలింగ్ బూత్‌కు వెళ్లాక చేతులు కాలడం ఖాయం. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ స్పెషల్ వెరిఫికేషన్ డ్రైవ్‌ను లైట్ తీసుకుంటే.. మీ ఓటు హక్కు గాల్లో కలవడం గ్యారెంటీ.
ఈ మెగా ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 15 నుంచి ప్రారంభమై, జూలై 14 వరకు నెల రోజుల పాటు నిరంతరాయంగా సాగనుంది. ఈ వ్యవధిలో బూత్ లెవెల్ అధికారులు (BLO) నేరుగా మీ ఇంటికే వస్తారు. మీ ఇంట్లో ఎంతమంది అర్హులైన ఓటర్లు ఉన్నారు? వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా? ఎవరైనా చనిపోయారా లేదా వేరే ప్రాంతాలకు వలస వెళ్లారా? అనే విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. జూలై 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులకు ఇదొక సువర్ణావకాశం. వారంతా ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా ఓటు హక్కును పొందవచ్చు.
బీఎల్వోలు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఓటరు కార్డు(Voter Card)తో పాటు ఆధార్ కార్డ్ లేదా పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాన్ని సిద్ధంగా ఉంచుకోండి. ఎన్యూమరేషన్ ఫారంలో మీ పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటి నంబర్, వయస్సు వంటి వివరాలను తప్పులు లేకుండా పూర్తి చేసి సంతకంతో అందజేయాలి. ఫారం-6ను కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి..ఫారం-8ను తప్పుల సవరణలు లేదా అడ్రస్ మార్పుల కోసం.. అలాగే ఫారం-7ను జాబితా నుండి అనర్హుల పేర్లను తొలగించడానికి ఉపయోగించాలి.
బీఎల్వోలు సేకరించిన సమాచారం ఆధారంగా జూలై 21న ఓటర్ల ప్రాథమిక ముసాయిదా జాబితాను విడుదల చేస్తారు. ఆ తర్వాత ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉంటుంది. వాటన్నింటినీ పరిష్కరించి, సెప్టెంబర్ 22, 2026 న ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. ప్రస్తుత డిజిటల్ కాలంలో దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లకు అడ్డుకట్ట వేసేలా ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. ఒకవేళ బీఎల్వోలు మీ ఇంటికి రాకపోయినా.. మీరు కంగారు పడాల్సిన పనిలేదు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ లేదా 'ఓటర్ హెల్ప్‌లైన్ యాప్' (Voter Helpline App) ద్వారా మీ మొబైల్ నంబర్ లేదా ఎపిక్ (EPIC) నంబర్ ఎంటర్ చేసి మీ ఓటు స్థితిని సులభంగా తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1950 కి కాల్ చేసి వివరాలు పొందవచ్చు. ఏమరపాటుగా ఉంటే మీ ఓటు చేజారే ప్రమాదం ఉంది.. కాబట్టి ఇప్పుడే అలర్ట్ అవ్వండి, మీ ఓటును భద్రపరుచుకోండి.