ఏపీలో పాఠశాల విద్యార్థుల తల్లులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ‘తల్లికి వందనం(Thalliki Vandanam)’ పథకం తదుపరి విడత సొమ్మును లబ్ధిదారుల జేబుల్లోకి చేర్చేందుకు అధికార యంత్రాంగం లైన్ క్లియర్ చేసింది. జూలై 16 నుంచి 18వ తేదీల నడుమ ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా వెల్లడించారు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న మెగా పేరెంట్స్ మీటింగ్స్ వేదికగా ఈ ప్రక్రియ పూర్తి కానుండటం విశేషం.
తిరుపతి(Tirupati) జిల్లా పర్యటనలో భాగంగా రేణిగుంటలో జరిగిన ఒక కీలక సమావేశంలో మంత్రి లోకేష్ ఈ వివరాలను పంచుకున్నారు. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తోందని, కేవలం ఐదు నెలల పాలనలోనే ఏకంగా 16 వేల ఉపాధ్యాయ కొలువులు, మరో 6 వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని గుర్తుచేశారు. నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు గానూ.. త్వరలోనే మరో 10,000 పోస్టులతో సరికొత్త జాబ్ క్యాలెండర్ కూడా తీసుకురాబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రభుత్వం చేస్తున్న మంచిని, సాధించిన విజయాలను జనాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు జూలై 15 నుంచి సరికొత్త కార్యాచరణకు మంత్రి పిలుపునిచ్చారు. 'ఇంటింటి ప్రచారం' ద్వారా ప్రతి ఒక్కరినీ పలకరించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో దూసుకుపోతూనే.. ప్రతిపక్షాల ట్రాప్‌లో పడకుండా క్రమశిక్షణతో వ్యవహరించాలని టీడీపీ(TDP) కేడర్‌కు సూచించారు.
కాగా, ఈ పర్యటనలో భాగంగా లోకేష్(Lokesh) పలు సర్కారు బడులను స్వయంగా తనిఖీ చేసి, విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతిభావంతులైన పిల్లలను సత్కరించడంతో పాటు, అర్హులకు నివేశన స్థలాల పత్రాలను అందజేశారు. అనంతరం దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకుని స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు.