తమిళనాడు రాజకీయాలకు, సినిమా గ్లామర్‌కు విడదీయరాని బంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత కాలం నుంచి మొన్నటి విజయ్‌కాంత్, నేటి దళపతి విజయ్ వరకు.. వెండితెరపై మెరిసిన స్టార్స్ చాలామంది ఇక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పారు. తాజాగా దళపతి విజయ్(Thalapathy Vijay) తన పొలిటికల్ ఎంట్రీతో కోలీవుడ్‌లో సరికొత్త వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. విజయ్ రాజకీయ ప్రస్థానం సక్సెస్ కావడం చూశాక.. ఇప్పుడు తమిళనాట మరో స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ హీరో మరెవరో కాదు.. వైవిధ్యమైన పాత్రలతో కోట్లాది మంది గుండెల్లో సంపాదించుకున్న సూర్య.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా సూర్య రాజకీయ అరంగేట్రంపై జోరుగా చర్చ సాగుతోంది. సూర్య ఎన్నో ఏళ్లుగా ‘అగరం ఫౌండేషన్(Agaram Foundation)’ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ సమాజంలో గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను చూసి, భవిష్యత్తులో సూర్య కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నైలో జరిగిన సూర్య అఖిల భారత అభిమానుల సంఘం సమావేశం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. ఈ మీటింగ్‌లో ఓ ముఖ్య ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను బట్టి.. సూర్య కూడా విజయ్ లాగే త్వరలోనే ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ తమిళ మీడియా కథనాలు వండటంతో ఈ వార్త క్షణాల్లో వైరల్ అయింది.
అయితే ఈ పొలిటికల్ రూమర్స్ కోలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించడంతో, సూర్య అధికారిక బృందం వెంటనే అలర్ట్ అయింది. వైరల్ అవుతున్న వార్తలపై స్పందిస్తూ అసలు నిజం ఏంటో తేల్చిచెప్పింది. ప్రస్తుతం సూర్య(Suriya)కు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కానీ, ప్రణాళిక కానీ అస్సలు లేవని స్పష్టం చేసింది. అభిమానుల సమావేశంలో వచ్చిన వ్యాఖ్యలు పూర్తిగా సదరు వ్యక్తిగత అభిప్రాయమే తప్ప.. వాటితో హీరో సూర్యకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసింది.
సూర్య(Suriya) చేస్తున్న సామాజిక సేవలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆయన టీమ్ కోరింది. ‘అగరం ఫౌండేషన్’ అనేది కేవలం విద్యార్థుల భవిష్యత్తును మార్చడం కోసం, సమాజంపై బాధ్యతతో ఏర్పాటు చేసిన సంస్థే కానీ.. దాని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు, స్వార్థాలు లేవని వివరించింది. ఇప్పటికైనా ఈ పుకార్లకు చెక్ పెట్టాలని విజ్ఞప్తి చేసింది. మొత్తానికి సూర్య టీమ్ ఇచ్చిన ఈ క్లారిటీతో ఆయన రాజకీయ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారానికి ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లయింది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.