సాయికృష్ణ కేసు.. కృష్ణలంక పీఎస్‌లో ఎముకలు, బూడిద..?

admin
Published by Admin — July 03, 2026 in Andhra
News Image

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. మే మొదటి వారంలో ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి సాయికృష్ణను విచారణ నిమిత్తం కృష్ణలంక స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు, ఆ తర్వాత అతను ఏమయ్యాడనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే, ఈ మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) జరిపిన సోదాల్లో నమ్మశక్యం కాని, ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన సిట్ అధికారులకు అక్కడ అనేక అనుమానాస్పద ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ముఖ్యంగా స్టేషన్ టెర్రస్ (పైకప్పు)పై మానవ ఎముకలు, బూడిదను అధికారులు గుర్తించడం సంచలనంగా మారింది. వీటితో పాటు పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న ఒక హ్యాండ్ గొలుసు, లాఠీని కూడా సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. కస్టడీలోనే సాయికృష్ణ(Sai Krishna)పై తీవ్రస్థాయిలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఆ హింస భరించలేకనే అతను ప్రాణాలు కోల్పోయాడని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. ఆ తర్వాత సాక్ష్యాధారాలను రూపుమాపేందుకే మృతదేహాన్ని స్టేషన్ పరిసరాల్లోనే దహనం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వస్తువులను కీలక ఆధారాలుగా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

ఈ ఘోరానికి సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక(Krishna Lanka) అప్పటి సీఐ నాగరాజును న్యాయస్థానం ఎనిమిది రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగించింది. జూలై 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయనను అధికారులు విచారించనున్నారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సీఐ నాగరాజు సమక్షంలోనే సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారనే అంశాన్ని సిట్ ఇప్పటికే తన రిమాండ్ రిపోర్టులో బలంగా ప్రస్తావించింది.

ఇక ఈ కేసులో కేవలం సీఐ నాగ‌రాజు(CI Nagaraju) మాత్రమే కాకుండా, పీఎస్‌లో పనిచేసే ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు (అశోక్ కుమార్, జంగం నాని), ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు (బాబూరావు, సాంబశివరావు) కూడా భాగస్వామ్యులైనట్లు తేలింది. సిట్ అధికారులు వీరిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, ప్రస్తుతం వీరంతా రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. రక్షించాల్సిన ఖాకీలే భక్షకులుగా మారి ఒక యువకుడి ప్రాణాలు తీసి, సాక్ష్యాలను బూడిద చేశారనే వార్త విజయవాడ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. సిట్ కస్టడీలో సీఐ నోరు విప్పితే ఈ కేసులో మరిన్ని చీకటి కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Tags
Sai Krishna Vijayawada Custodial Death Krishna Lanka PS Andhra Pradesh AP Crime Ap News SIT CI Nagaraju
Recent Comments
Leave a Comment

Related News