కేంద్రం తలతిక్క నిర్ణయం.. విదేశాలకు వెళ్లేవారికి ఇక చుక్కలే!

admin
Published by Admin — July 06, 2026 in Politics, National
News Image

భారతదేశం(India)లో అత్యున్నత గుర్తింపు పత్రాల్లో ఒకటైన ‘పాస్‌పోర్ట్’ విలువను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా తగ్గించేసింది. ఇప్పటివరకు పాస్‌పోర్ట్ ఉంటే చాలు, అతడు దేశ పౌరుడే అని గుడ్డిగా నమ్మే పరిస్థితి ఉండేది. కానీ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా చేసిన ఒక ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనానికి, తీవ్ర చర్చకు దారితీసింది. పాస్‌పోర్ట్ అనేది కేవలం విదేశాలకు వెళ్లడానికి ఉపయోగపడే ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని, అంతకుమించి దానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని కేంద్రం తేల్చి చెప్పింది. అంటే, పాస్‌పోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ భారత పౌరులు కానక్కర్లేదనే అర్థం వచ్చేలా కేంద్రం మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం(Central Government) తీసుకున్న ఈ వింత‌ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు చుక్కలు కనబడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఏ దేశ ఎంబసీ అయినా, ఒక వ్యక్తికి వీసా ఇచ్చే ముందు అతడి పాస్‌పోర్ట్‌ను చూసి పౌరసత్వాన్ని నిర్ధారించుకుంటుంది. కానీ, సొంత ప్రభుత్వమే ఆ పాస్‌పోర్ట్‌కు పౌరసత్వ విలువ లేదని చెబుతుంటే, విదేశీ రాయబార కార్యాలయాలు మన దేశ ప్రజలను ఎలా నమ్ముతాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ గందరగోళం వల్ల భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులకు వీసాలు నిరాకరించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

కేంద్రం నిర్ణయంపై సామాన్య పౌరులతో పాటు పలువురు చట్ట నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1967 పాస్‌పోర్ట్(Passport) చట్టం ప్రకారం.. లోతైన విచారణ, పోలీసు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే భారత పౌరులకు ఈ పత్రాన్ని జారీ చేస్తారు. అలాంటిది, ఇప్పుడు దీనిని కేవలం ప్రయాణ పత్రంగా మార్చేస్తే, భవిష్యత్తులో తాము భారతీయులమే అని నిరూపించుకోవడానికి ప్రజలు ఏ డాక్యుమెంట్ చూపించాలో కేంద్రమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ తలతిక్క నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని, పాస్‌పోర్ట్‌ను పౌరసత్వ పత్రంగానే కొనసాగించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Tags
Indian Passport Passport Controversy MEA Visa Alert Citizenship Travel Document Passport
Recent Comments
Leave a Comment

Related News