ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర భుజం నొప్పితో ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా రెండు భుజాల రొటేటర్ కఫ్ సమస్యతో బాధపడుతున్న ఆయనకు, శనివారం ఉదయం నిపుణులైన వైద్య బృందం విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసింది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో పవన్ కుడి భుజానికి సంబంధించిన దెబ్బతిన్న భాగాలను వైద్యులు సరిచేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారని జనసేన వర్గాలు వెల్లడించాయి.
అయితే, పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు ఒకేసారి రెండు భుజాలకు ఆపరేషన్ చేయడం సాధ్యం కాలేదు. రెండు చేతులకు ఒకేసారి సర్జరీ చేస్తే రోజువారీ పనులకు తీవ్ర ఇబ్బంది అవుతుందని భావించిన డాక్టర్లు, ప్రస్తుతానికి కేవలం కుడి భుజానికి మాత్రమే చికిత్స అందించారు. ఎడమ భుజానికి మరో రెండు నెలల తర్వాత రెండో విడత సర్జరీ చేయనున్నారు. అప్పటివరకు ఆయనకు ప్రత్యేక ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కొనసాగనుంది.
ఎన్నికల ప్రచారాలు, వరుస రాజకీయ యాత్రలు, షూటింగుల వల్ల పవన్(Pawan) భుజం నొప్పి తీవ్రతరమైనట్లు తెలుస్తోంది. వైద్యుల పరీక్షల అనంతరం సర్జరీ తప్పనిసరి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆపరేషన్ విజయవంతం కావడంతో కోట్లాది మంది అభిమానులు, జనసైనికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థనలు చేస్తున్నారు. డాక్టర్ల సూచనల ప్రకారం పవన్ కొన్ని రోజుల పాటు పూర్తిగా రాజకీయాలకు, పనులకు దూరంగా ఉండి రెస్ట్ తీసుకోనున్నారు.