ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, కాపు ఉద్యమ రథసారథి ముద్రగడ పద్మనాభం (73) ఇకలేరు. హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నీలం సంజీవరెడ్డి వంటి మహామహుల స్ఫూర్తితో, తండ్రి వీరరాఘవరావు రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham).. దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు తెలుగు రాజకీయాలను శాసించారు. నిలకడ లేని పార్టీల మార్పులు, సంచలన నిర్ణయాలు, కుల సమీకరణాల చుట్టూ తిరిగిన ఆయన ప్రస్థానం తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం.
1978లో కేవలం 25 ఏళ్ల ప్రాయంలోనే జనతా పార్టీ తరఫున ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు ముద్రగడ. ఆ తర్వాత 1982లో లెజెండరీ నటుడు ఎన్.టి. రామారావు (NTR) తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయనతో చేతులు కలిపారు. 1983, 1985 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి NTR క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, ఎన్టీఆర్‌తో వచ్చిన కొన్ని రాజకీయ విభేదాల కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేసి, సొంతంగా 'తెలుగు నాడు' పార్టీని స్థాపించడం ద్వారా అప్పట్లోనే తన అసమ్మతి గళాన్ని బలంగా వినిపించారు.
1989లో రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ముద్రగడ.. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. సరిగ్గా ఇదే కాలంలో ఆయన పొలిటికల్ కెరీర్ ఒక పెద్ద మలుపు తిరిగింది. 1989, 1994ల మధ్య కాలంలో ఆయన కాపు రిజర్వేషన్ల (కాపునాడు) ఉద్యమానికి తెరతీశారు. ఈ ఉద్యమం ఆయనను కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఒక సామాజిక వర్గానికి తిరుగులేని ఆరాధ్య నేతగా నిలబెట్టింది. ఆ తర్వాత కాలంలో బీజేపీలో చేరి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి దగ్గరవ్వడం, తిరిగి 1999లో టీడీపీ తరఫున కాకినాడ ఎంపీగా గెలుపొందడం ఆయన రాజకీయ చదరంగంలో మరికొన్ని కీలక గమ్యస్థానాలు.
2014 తర్వాత ఏపీ రాజకీయాల్లో కాపు రిజర్వేషన్ల అంశం మళ్లీ తెరపైకి వచ్చినప్పుడు ముద్రగడ పద్మనాభం కేంద్ర బిందువుగా మారారు. తుని రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఘటన, ఆమరణ నిరాహార దీక్షలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన కుమారుడు గిరితో కలిసి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని, ఓడిపోతే పేరు మార్చుకుంటానని ఆయన చేసిన సవాల్ తీవ్ర దుమారం రేపింది. పవన్ విజయం తర్వాత, మాట తప్పకుండా తన పేరును గెజిట్ నోటిఫికేషన్ ద్వారా 'ముద్రగడ పద్మనాభ రెడ్డి'గా మార్చుకుని నిలకడైన నైజాన్ని చాటుకున్నారు.
ఇక ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంనిర్ణయించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల సమయంలో జనసేన, టీడీపీ(TDP) కూటమిపై ముద్రగడ తీవ్ర విమర్శలు చేసినప్పటికీ.. రాజకీయ విభేదాలను, గత వైరాన్ని పూర్తిగా పక్కన పెట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను, సీనియర్ నాయకుడిగా ఆయనకున్న లీగసీని గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు కాపు సామాజిక వర్గంలోనూ సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.