‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించిన హీరో యశ్. తన కొత్త సినిమా కోసం సుదీర్ఘ కాలంగా సాగుతున్న నిరీక్షణకు ఎట్టకేలకు ఈ రోజే తెరపడింది. మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్.. యశ్ హీరోగా తెరకెక్కించిన ‘టాక్సిక్’ భారీ అంచనాల మధ్య బుధవారమే రిలీజైంది. ఈ సినిమాకు టాక్ ఏమీ బాగా లేకపోయినా.. ఓపెనింగ్స్ అయితే భారీగానే రాబోతున్నాయన్నది స్పష్టం. ఇండియాలోనే కాక విదేశాల్లోనూ ‘టాక్సిక్’కు అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరిగాయి. వంద కోట్ల ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తోంది.
ఐతే ఇంత హైప్ తెచ్చుకున్న సినిమా మీద రిలీజ్‌కు ముందు రోజు నుంచే ఒక నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుండడం గమనార్హం. #Boycotttoxic అంటూ ఈ సినిమాకు వ్యతిరేకంగా ట్రెండ్ చేస్తున్నది మన తెలుగు వాళ్లే. దీంతో పాటుగా ఇరుముడి సినిమాను సేవ్ చేయాలని.. దిల్ రాజు సంస్థను బాయ్‌కాట్ చేయాలని.. ఆయన్నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని కాపాడాలని కూడా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.
తెలుగు సినిమా అయిన ‘ఇరుముడి’ తొలి వీకెండ్ తర్వాత కూడా చాలా బాగా ఆడుతుండగా.. ఆ సినిమా స్క్రీన్లను పెద్ద ఎత్తున లాగేసి ‘టాక్సిక్’కు ఇవ్వడం పట్ల ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి సినిమా బాగా ఆడుతున్న మెజారిటీ సింగిల్ స్క్రీన్లను ‘టాక్సిక్’ కోసం తీసేసుకున్నారు. మల్టీప్లెక్సుల్లో కూడా ఈ డబ్బింగ్ మూవీకే షోలు ఎక్కువ కేటాయించారు. గతంలో తెలుగు సినిమాలు పోటీలో ఉండగా, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు, షోలు ఎలా ఇస్తామంటూ మాట్లాడిన దిల్ రాజు.. ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమాను తాను రిలీజ్ చేసేసరికి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
అలాగే ఒక డబ్బింగ్ సినిమాకు టికెట్ల ధరలు పెంచడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘టాక్సిక్’ సినిమాకు, దిల్ రాజుకు వ్యతిరేకంగా.. ‘ఇరుముడి’ సినిమాకు అనుకూలంగా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. కర్ణాటకలో ‘గేమ్ చేంజర్’, ‘ఓజీ’ లాంటి సినిమాలకు వ్యతిరేకంగా జరిగిన కొన్ని ఉదంతాలకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ‘టాక్సిక్’ సినిమా మీద విరుచుకుపడుతున్నారు తెలుగు నెటిజన్లు.