వైసిపి పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది అనేది తాజాగా చాణక్య స్ట్రాటజీ వెల్లడించిన సర్వే స్పష్టం చేస్తుంది. గత రెండున్నర ఏళ్ల కిందట 49% ఓటు బ్యాంకు దక్కించుకున్న వైసీపీకి ఇప్పుడు కేవలం 35% మాత్రమే ప్రజలు అనుకూలంగా ఉన్నారని ఈ సర్వే స్పష్టం చేసింది. అంతేకాదు ప్రజల్లో కూడా మెజారిటీ వర్గం వైసీపీకి దూరమైనట్టు పేర్కొంది. ఇది ఒక రకంగా వైసీపీకి ప్రధాన ఇబ్బందికర పరిస్థితిని స్పష్టం చేస్తోంది. అంతేకాదు వైసిపి అనుసరిస్తున్న వ్యూహాలు ప్రజలకు ఆ పార్టీ ఏ విధంగా దూరమవుతుందన్నది కూడా ఈ సర్వే వెల్లడించింది.
మొత్తం 50 వేల మందిని రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసిన చాణక్య స్ట్రాటజీ సంస్థ వైసిపి కి కేవలం 18,375 మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. అంటే కనీసం సగం మంది కూడా వైసీపీకి అనుకూలంగా లేరు. కానీ తరచుగా వైసిపి అధినేత జగన్ చెబుతున్న మాట.. ప్రజలు తమ వైపే ఉన్నారని. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము గెలుస్తామని అంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ పరిస్థితి కేవలం 35% ఓటు బ్యాంకుకు మాత్రమే పరిమితం అవుతుందని ఈ సర్వే వెల్లడించింది.
నిజానికి ఒక పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత ప్రజల్లో సింపతీ ఏర్పడాలి. ఆ పార్టీ పట్ల అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించాలి. కానీ వైసీపీ పరిస్థితి ఆ విధంగా లేదన్నది ఈ సర్వే చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ ఓటు బ్యాంకు విషయంలో భారీగా తేడా వచ్చినట్టు చాణక్య సంస్థ వెల్లడించింది. పూర్తిస్థాయి గణాంకాలు వెల్లడించకపో యినప్పటికీ వైసీపీకి మాత్రం ఈ పరిస్థితి ఇబ్బందికరంగానే మారుతుందని మాత్రం స్పష్టం చేసింది. గత ఎన్నికల సమయంలో 49% ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు దారుణంగా 35 శాతానికి పడిపోవడం ఆ పార్టీ తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవలసిన పరిస్థితిని ఈ సర్వే పేర్కొంది.
ఒకరకంగా ఇది వైసీపీకి ఒక అద్భుతమైన అవకాశమనే చెప్పాలి. ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉండగానే ఈ సర్వే ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 కోట్ల పైచిలుకు ఓటు బ్యాంకు ఉంటే వీరిలో 50వేల మందిని మాత్రమే సర్వే సంస్థ పలకరించినప్పటికీ ప్రజల నాడిని పట్టుకునే విషయంలో అన్ని వర్గాలకు ఈ సర్వే ప్రాధాన్యం ఇచ్చింది. కాబట్టి వైసిపి ఈ సర్వే ను తేలికగా కాకుండా సీరియస్ గా తీసుకుని భవిష్యత్తు వ్యూహాలను పటిష్టం పరుచుకునేందుకు వినియోగించుకోవాలి.