దేశంలో టాప్-10 ధనిక ఎమ్మెల్యేలు వీళ్లే.. ఏపీ నుంచి న‌లుగురు!

admin
Published by Admin — March 20, 2025 in Politics
News Image

సాధారణంగా సినీ తారల ఆస్తుల వివరాలే ఎప్పుడూ తెరపైకి వస్తుంటాయి. అయితే ఈసారి ప్రజా ప్రతినిధుల ఆస్తుల లెక్కలు నెట్టింట‌ ట్రెండ్ అవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏయే ఎమ్మెల్యేలకు ఎంత ఆస్తి ఉంది? అన్న విషయంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) స‌ర్వే నిర్వ‌హించింది. ఎన్నికల స‌మ‌యంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా మొత్తం 28 రాష్ట్రాల అసెంబ్లీలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,092 మంది ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు సేక‌రించి దేశంలో టాప్-10 ధనిక ఎమ్మెల్యేల లిస్ట్ ను విడుద‌ల చేసింది ఏడీఆర్. అయితే ఈ జాబితాలో ఏపీ నుంచి న‌లుగురు ఎమ్మెల్యేలు చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం.

ముంబైలోని ఘట్కోపర్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా టాప్ 1 స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ అక్ష‌రాల‌ రూ.3,400 కోట్లు. ఇండియాలోనే మోస్ట్ రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఆయ‌న‌. కర్ణాటకలోని కనకపుర ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ రూ.1,413 కోట్ల ఆస్తులతో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే కె.హెచ్. పుట్టస్వామి గౌడ (రూ.1,267 కోట్లు) మూడో స్థానంలో, కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియకృష్ణ (రూ.1,156 కోట్లు) నాలుగో స్థానంలో, ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్ష‌డు నారా చంద్ర‌బాబు నాయుడు (రూ.931 కోట్లు) ఐదో స్థానంలో ఉన్నారు.

ఏపీ టీడీపీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ (రూ.824 కోట్లు), ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధ్య‌క్ష‌డు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (రూ.757 కోట్లు), ఏపీ టీడీపీ ఎమ్మెల్యే వి. ప్రశాంతి రెడ్డి (రూ.716 కోట్లు), గుజ‌రాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జయంతిభాయ్ సోమభాయ్ పటేల్ (రూ.661 కోట్లు), క‌ర్ణాట‌క‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేశ బి.ఎస్ (రూ.648 కోట్లు) ఆ స్థానాల్లో వ‌రుస‌గా నిలిచారు. టాప్-20 ధ‌నిక ఎమ్మెల్యేల్లో ఏపీ నుంచి మంత్రి నారా లోకేశ్, హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చోటు సంపాదించుకున్నారు.

మొత్తం 4,092 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ. 73,348 కోట్లు. పార్టీల వారీగా చూస్తే బీజేపీకి చెందిన ఎమ్మెల్యేల‌కు ఎక్కువ ఆస్తులు ఉన్నాయ‌ని ఏడీఆర్ నివేదిక చెబుతోంది. మొత్తం ఎమ్మెల్యేల్లో 1,653 మంది బీజేపీకి చెందిన వారే కాగా.. వారి ఆస్తుల విలువ రూ.26,270 కోట్లుగా ఏడీఆర్ రిపోర్ట్ చెబుతున్నారు. అలాగే దేశంలో అత్యంత ధ‌నిక ఎమ్మెల్యే, అత్యంత పేద ఎమ్మెల్యే బీజేపీ స‌భ్యులే కావ‌డం గ‌మ‌నార్హం. పశ్చిమ బెంగాల్‌లోని ఇండస్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా అతి త‌క్కువ ఆస్తిని క‌లిగి ఉన్నారు. ఆయన ఆస్తులు రూ.1,700.

ఇక రాష్ట్రాల వారీగా క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ టాప్ లో ఉన్నాయి. కర్ణాటకలో 223 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా.. వారి మొత్తం సంపద విలువ రూ.14,179 కోట్లుగా ఉంది. మహారాష్ట్రలోని 286 మంది ఎమ్మెల్యేల ఆస్తి క‌లిపి రూ.12,424 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక‌రు మిన‌హా 174 మంది ఎమ్మెల్యేల మొత్తం సంపద రూ.11,323 కోట్లు. చిట్ట‌చివ‌ర త్రిపుర ఉంది. అక్క‌డ 60 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా.. వారి మొత్తం ఆస్తి విలువ రూ.90 కోట్లు.

Recent Comments
Leave a Comment

Related News