ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తన కూతురు పెళ్లి ఆహ్వాన పత్రికను ఇచ్చిన వ్యవహారం పై వైసీపీ రాజకీయం చేస్తున్న సంగతి తెలిసింద చెట్టాపట్టాలేసుకుని అంటూ షర్మిలను అవమానకర రీతిలో విమర్శించిన వైసీపీ నేతలు తమ తీరును సమర్థించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
తనకు పెళ్లి పత్రిక ఇచ్చిన విషయంపై కూడా వైసిపి నేతలు, సాక్షి పత్రిక రాజకీయం చేయడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, తాను స్నేహితులమని.. రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ అప్పట్లో జగన్ పెళ్లికి, షర్మిల పెళ్ళికి కూడా తను వెళ్లానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రాజకీయాలకు, మానవ సంబంధాలకు సంబంధం లేదన్నారు. ఆ విషయం కూడా తెలియకుండా సాక్షి పత్రిక తప్పుడు కథనాలు రాస్తుందని మండిపడ్డారు.
కాగా, షర్మిలకు ఆమె తల్లి విజయమ్మ అండగా నిలిచారు. షర్మిలకు జరుగుతున్న అన్యాయం, ఆమెపై జరుగుతున్న తప్పుడు ప్రచారం చూసి తల్లిగా తన మనసు తీవ్రంగా కలిసి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి బతికుంటే ఈ పరిణామాలు చూసి ఎంతో బాధపడే వారని ఆమె అన్నారు. ఒక ముఖ్యమంత్రికి తన కూతురు ఆహ్వాన పత్రిక అందించడంలో తప్పేంటి అని ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ 50 ఏళ్ల క్రితమే వారిద్దరి మధ్య స్నేహం ఉందని, వారిద్దరూ వ్యక్తిగతంగా స్నేహితులని గుర్తు చేశారు. తన తండ్రి వయసున్న వ్యక్తికి, తన తండ్రి మిత్రుడికి శుభలేఖ అందించడం సంస్కారం అని అన్నారు. రాజకీయాలు వేరు, మానవ సంబంధాలు వేరని వైఎస్సార్ బలంగా నమ్మిన విషయాన్ని గుర్తు చేశారు.
రాజకీయ ప్రత్యర్థులతో కూడా గౌరవప్రదంగా సంబంధాలు కొనసాగించిన చరిత్ర తన భర్త రాజశేఖర్ రెడ్డిదని అన్నారు. కేవలం రాజకీయ లబ్ది పొందేందుకే సొంతవారు తప్పుడు రాతలు రాస్తూ షర్మిల వ్యక్తిత్వంపై బురదజల్లుతున్నారని, అది అత్యంత బాధాకరమని విజయమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిలను రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ రకంగా ఆమె ఆత్మ గౌరవాన్ని , కుటుంబ సంబంధాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.