రాజ్య‌స‌భ సీటుకు ఉప ఎన్నిక‌.. సాయిరెడ్డి స్థానం ఎవ‌రికి?

admin
Published by Admin — April 16, 2025 in Politics
News Image

ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటుకు సీఈసీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వైసీపీలో జగన్ తర్వాత అన్ని తానే అన్నట్లుగా వ్యవహరించిన కీలక నేత విజయ సాయిరెడ్డి.. 2028 జూన్ వరకు పదవి కాలం ఉన్నప్పటికీ ఇటీవ‌ల‌ రాజ్యసభ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయ సాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పార్లమెంట్ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది.

ఈ నెల 22 నుండి 29 వరకు నామినేషన్ల స్వీకరణ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. 30న నామినేషన్ల పరిశీలన చేప‌డ‌తారు. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వ‌హిస్తారు. అదే రోజు ఫలితాలు వెలువ‌డ‌నున్నాయి. వైసీపీకి సంఖ్యా బలం లేకపోవటంతో ఎన్డీఏ ఏకగ్రీవంగానే సీటు గెలుచుకోవ‌డం ఖాయ‌మైంది. అయితే కూట‌మిలో విజ‌య‌సాయిరెడ్డి స్థానం ఎవ‌రికి ద‌క్క‌నుంది అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

గతంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వ‌గా.. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన స‌మానంగా పంచుకోవాల‌ని తొలుత భావించారు. కానీ చంద్ర‌బాబు అభ్యర్ధనతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సోద‌రుడి సీటును టీడీపీకి త్యాగం చేశారు. దాంతో టీడీపీ త‌ర‌ఫున బీద మ‌స్తాన్‌రావు, సానా స‌తీష్‌, బీజేపీ నుంచి ఆర్‌.కృష్ణ‌య్య ఏక‌గ్రీవంగా పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. ఇక ఈసారి ఖాళీ అయిన సీటు కోసం మూడు పార్టీల్లో ఎవరికి వారు తమకే అనే అంచనాతో ఉన్నారు. కానీ, రాజ్యసభ విషయంలో బీజేపీ పట్టు బిగించిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

సాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం త‌మ‌కే అన్న‌ట్లుగా ఢిల్లీ బీజేపీ నాయకత్వం ఇప్ప‌టికే చంద్రబాబు, పవన్ కు సంకేతాలు పంపిన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎంపీ సీటు రేసులో క‌మ‌లం పార్టీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు తో పాటుగా మరికొంద‌రి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. మ‌రోవైపు విజ‌య‌సాయిరెడ్డి సైతం బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే సాయిరెడ్డి బీజేపీలో చేరి.. తాను ఖాళీ చేసిన రాజ్య‌స‌భ సీటును మ‌ళ్లీ తానే ద‌క్కించుకోనున్నార‌ని కొంద‌రు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే సాయిరెడ్డి బీజేపీ చేరిక‌కు టీడీపీ నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. అందువ‌ల్ల ఆయ‌న చేరిక ఇప్ప‌ట్లో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని కూడా అంటున్నారు. ఇక ఒక‌వేళ ఈసారి బీజేపీ వెన‌క్కి త‌గ్గిందంటే క‌చ్చితంగా టీడీపీకే రాజ్య‌స‌భ సీటు ద‌క్కుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Recent Comments
Leave a Comment

Related News