చంద్రబాబుపై బిల్ గేట్స్ ప్రశంసలు…కీలక ఒప్పందం

admin
Published by Admin — March 19, 2025 in Politics
News Image

ఢిల్లీ పర్యటన సందర్భంగా గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్‌ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధి కోసం అనేక అంశాలపై వారు లోతైన చర్చ జరిపారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి, గేట్స్ ఫౌండేషన్ కు మధ్య వ్యూహాత్మక సహకారానికి అవగాహనా ఒప్పందం కుదిరింది. ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్, విద్య, వ్యవసాయం వంటి కీలక రంగాలలో తక్కువ ఖర్చుతో కూడుకున్న, విస్తరించ దగిన పరిష్కారాలను అనుసంధానించడం ద్వారా ప్రజల సంక్షేమం కోసం సాంకేతికతను ఉపయోగించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం.

ప్రభుత్వం గుర్తించిన భాగస్వాములకు, ప్రభుత్వ కార్యక్రమాలలో వివిధ ప్రయోజనాల కోసం గేట్స్ ఫౌండేషన్ మద్దతునివ్వబోతోంది. ఆరోగ్య విశ్లేషణ, ఆటోమేటెడ్ డయాగ్నస్టిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం, వ్యవసాయంలో ఏఐ ఆధారిత సలహా వేదికలు, ఖచ్చితమైన వ్యవసాయం, వనరుల నిర్వహణ కోసం ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.

గేట్స్ ఫౌండేషన్ మద్దతుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. గేట్స్ తో భాగస్వామ్యం ఏపీ అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఏఐ ఆధారిత పాలన, మానవ మూలధన అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యలో సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా, ఈ అవగాహన ఒప్పందం ద్వారా వచ్చే ఫలితాలు మన రాష్ట్రానికి మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బిల్ గేట్స్ కు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు కృషిని బిల్ గేట్స్ ప్రశంసించారు. బలహీన వర్గాల ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి తక్కువ ఖర్చుతో, స్థానికంగా ఉత్పత్తి చేయబడిన రోగ నిర్ధారణలు, వైద్య పరికరాలను అందించడంలో ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య వంటి కీలక రంగాలను పరిష్కరించడానికి ఏఐ, సాంకేతిక పరిష్కారాలను ఉపయోగించడం ద్వారా, భారత దేశంలోని ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలవవచ్చని గేట్స్ అన్నారు.

Recent Comments
Leave a Comment

Related News

Latest News