చిరు, ప‌వ‌న్ నుంచి అప్పులు.. నాగ‌బాబు మొత్తం ఆస్తి ఎంతంటే?

admin
Published by Admin — March 09, 2025 in Movies
News Image

ఎమ్మెల్యేల కోటాలో కాళీ కాబోతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో కూటమి తొలి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మెగా బ్రదర్ నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం అసెంబ్లీకి వచ్చిన నాగ‌బాబు మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, కొణతాల రామకృష్ణులతో కలిసి నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పుల వివరాలను నాగబాబు వెల్లడించారు.

త‌న‌పై ఎటువంటి క్రిమిన‌ల్ కేసులు లేవ‌ని నాగ‌బాబు పేర్కొన్నారు. అలాగే అన్న చిరంజీవి, త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి అప్పులు తీసుకున్న విషయాన్ని కూడా ఆయ‌న బ‌య‌ట‌పెట్టారు. అఫిడవిట్‌లో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం.. నాగ‌బాబు మొత్తం ఆస్తి విలువ రూ. 70 కోట్లు. అందులో రూ.59 కోట్ల చరాస్తులు, రూ.11 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

చరాస్తులు విష‌యానికి వ‌స్తే.. మ్యూచువల్ ఫండ్స్/బాండ్ల రూపంలో నాగ‌బాబు రూ. 55.37 కోట్లు పెట్టుబడి పెట్టారు. రూ. 21.81 లక్షల నగదు చేతిలో ఉండ‌గా.. రూ. 23.53 లక్షలు బ్యాంకులో ఉన్నాయి. ఇతరులకు ఇచ్చిన అప్పుల విలువ‌ రూ.1.03 కోట్లు. రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, భార్య వద్ద రూ.16.50 లక్షలు విలువ చేసే 55 క్యారెట్ల వజ్రాలు, రూ.21.40 లక్షలు విలువ చేసే 20 కేజీల వెండి ఉన్న‌ట్లు నాగ‌బాబు తెలిపారు. రూ.67.28 లక్షలు ఖ‌రీదు చేసే బెంజ్ కారు, రూ.11.04 లక్షలు ఖ‌రీదు చేసే హ్యుందాయ్ కారు నాగ‌బాబు వ‌ద్ద ఉన్నాయి.

స్థిరాస్తులను ప‌రిశీలిస్తే.. రంగారెడ్డి జిల్లాలో రూ.5.3 కోట్లు విలువ చేసే 2.39 ఎకరాల భూమి నాగ‌బాబు పేరిట ఉంది. అలాగే మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ.82.80 లక్షలు విలువైన‌ 8.28 ఎకరాల భూమి, రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో రూ.53.50 లక్షలు ఖ‌రీదు చేసే 1.07 ఎకరాల భూమి ఆయ‌న‌కు ఉంది. వీటితో పాటు హైదరాబాద్ మణికొండలో రూ.2.88 కోట్లు విలువ చేసే విల్లా కూడా నాగ‌బాబుకు ఉంది.

ఇక అప్పుల విష‌యానికి వ‌స్తే.. అన్న‌య్య చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు అప్పు, త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ద్ద రూ.6.90 లక్షలు అప్పు తీసుకున్నట్లు నాగ‌బాబు పేర్కొన్నారు. అంతేకాకుండా బ్యాంక్ హౌసింగ్ లోన్ రూ.56.97 లక్షలు, కారు లోన్ రూ.7.54 లక్షలు ఉన్నట్లు కూడా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Recent Comments
Leave a Comment

Related News