కూట‌మి కంట్లో న‌లుసుగా మారిన బీజేపీ ఎమ్మెల్యే..!

admin
Published by Admin — April 17, 2025 in Politics, Andhra
News Image

బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూట‌మి కంట్లో న‌లుసుగా మారారా? ఆయ‌న వివాదాస్పద వ్య‌వ‌హార శైలి కూట‌మికి త‌ల‌నొప్పిగా మారిందా? అంటే అవునన్న స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో ఎవరు అధికారంలో ఉంటే వారిదే రాజ్యం. అదే అలుసుగా తీసుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఆది తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గాన్ని క‌నుసైగ‌ల‌తో శాసించాల‌ని చూస్తున్నారు. అంతా త‌న‌దే.. తాను చెప్పినట్లే నడవాలి.. లేదంటే ప‌నులు జ‌ర‌గ‌వ్‌ అన్న‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హిరిస్తున్నారు.

కొద్ది నెల‌ల క్రితం ఫ్లైయష్ కోసం అసంత‌పురం జిల్లాకు చెందిన‌ జేసీ ప్రభాకర్ రెడ్డితో ఆది గొడ‌వ పెట్టుకుని నానా ర‌చ్చ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే సీఎం ర‌మేష్‌తోనూ వివాదం పెట్టుకుని హెడ్‌లైన్స్ లో నిలిచారు. ఇక ఇప్పుడు స్థానిక సిమెంట్ కంపెనీలతో ఆయ‌న‌ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. జమ్మలమడుగు నియోజకవ‌ర్గ ప‌రిధిలో సిమెంట్ ప‌రిశ్ర‌మ యూనిట్లు అధికం. సాధార‌ణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయ‌కుల హ‌వానే అక్క‌డ న‌డుస్తుంది. ఆ పార్టీకి చెందిన నేత‌ల మ‌న‌షుల‌కే ప‌నులు ద‌క్కుతాయి.

ప్ర‌స్తుతం కూట‌మి అధికారంలో ఉండ‌టంతో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల‌పై జులుం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్ట‌రీల‌కు అవసరమయ్యే ముడి సరుకు సరఫరా రవాణా తో పాటు అక్కడ ఉత్పత్తి అయిన సిమెంట్ కు సంబంధించిన రవాణా కాంట్రాక్టులన్నీ తనకే కావాలంటూ ఆది డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ కాంట్రాక్ట్ నిర్వ‌హిస్తున్న వారిని బ‌య‌ట‌కు పంప‌లేమ‌ని యాజ‌మాన్యం చెబుతున్నా.. వినిపించుకోకుండా తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. త‌ర‌చూ గొడ‌వ‌లు పెట్టుకుంటున్నారు. దాంతో యాజమాన్యం ఇప్ప‌టికే కొన్ని కాంట్రాక్టులు ఇచ్చేసింది. అయిన‌స‌రే ఆది వ‌ర్గం శాంతించ‌లేదు. ఇవి స‌రిపోవ్‌.. అన్ని కాంట్రాక్టులు కావాలంటూ హుకుం జారీ చేసింది.

యాజమాన్యం త‌మ దారిలోకి రాక‌పోయే స‌రికి ఇప్పుడు జమ్మలమడుగులో ఉన్న సిమెంట్ పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపోయే పరిస్థితిని కూడా తీసుకొచ్చారు. ముడి సరుకులు సిమెంట్ ప్లాంట్లకు పోనివ్వకుండా ఎమ్మెల్యే అనుచ‌రులు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమీ చేయలేక త‌మ ప‌రిస్థితిని మీడియా మ‌రియు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. అయితే సీఎంఓ కార్యాల‌యం నుంచి ఆదేశాలు వెళ్లినా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెన‌క్కి త‌గ్గ‌డం లేద‌ట‌. దాంతో ఆయ‌న‌పై బీజేపీ హై క‌మాండ్ కు ఫిర్యాదు చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఆది తీరు ఇలానే కొన‌సాగితే కూట‌మికి అది పెద్ద స‌మ‌స్య‌గా మారుతుంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

Tags
AP News ap politics BJP
Recent Comments
Leave a Comment

Related News