58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం..బాబు, లోకేశ్ ఘన నివాళి

admin
Published by Admin — March 16, 2025 in Politics, Andhra
News Image

ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను చంద్రబాబు స్మరించుకున్నారు. తెలుగు జాతి నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని చంద్రబాబు ప్రశంసించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆత్మ త్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని కొనియాడారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిద్దామని చంద్రబాబు అన్నారు. ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందామని, భావి తరాలకు ఆయన త్యాగాన్ని చాటిచెబుదామని చంద్రబాబు అన్నారు.

పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా రాజధాని అమరావతిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు ప్రకటించారు. పొట్టి శ్రీరాములు స్మారక పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల్లూరులోని ఆయన స్వగ్రామం అభివృద్ధికి చర్యలు చేపడతామని, అక్కడ మ్యూజియం, పొట్టి శ్రీరాములు పేరుతో ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

ప్రతి ఒక్కరు పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో పనిచేసే పదిమంది తెలుగువారిని పైకి తేవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  ఈ ఏడాది మార్చి 16 నుంచి వచ్చే 16 వరకు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణతో పాటు డూండీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు, పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయనకు మంత్రి లోకేశ్ ఘన నివాళి అర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని గుర్తు చేసకున్నారు. పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన కృషి వల్లే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషిచేశారని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం అందరం పునరంకితమవుదామని లోకేశ్ పిలుపునిచ్చారు.

Tags
cm chandrababu condolences hunger strike
Recent Comments
Leave a Comment

Related News