ఏపీలోని అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అట్టుడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉద్రిక్తత కూడా కొనసాగుతోంది. దీనికి కారణం.. ఇక్కడి గిరిజన ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. రెండు రోజుల పాటు బంద్ పాటించాలని కూడా పిలుపునిచ్చారు. అంతేకాదు.. రహదారులపైకి వచ్చి.. దుకాణాలు బంద్ చేయించారు. మన్యానికి దారితీసే లోయలు, రహదారులపై ముళ్ల కంచెలు వేసి కాపలాగా ఉన్నారు. దీంతో మన్యంజిల్లా గిరిజనాగ్రహంతో అట్టుడుగుతోంది.
ఎందుకు?
గిరిజనుల భూములకు, వారి వ్యక్తిగత ఆస్తుల భద్రతకు సంబంధించి 1970లో నియంత్రణ చట్టం తీసుకు వచ్చారు. ఇది 1/70 చట్టంగా ప్రచారంలో ఉంది. ఈ చట్టం ప్రకారం.. గిరిజనుల భూములు, ఆస్తులను గిరిజనేతరులకు కానీ.. పారిశ్రామిక అవసరాలకు కానీ.. వినియోగించేందుకు వీల్లేదు. పైగా.. గిరిజనులకు భద్రత కల్పించాలి. వారి ఆస్తులకు రక్షణగా ప్రభుత్వంఏర్పాటు చేయాలి. ఇది అప్పటినుంచి ఇప్పటి వరకు.. అమలు అవుతూనే ఉంది.
ఇప్పుడు ఏం జరిగింది?
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పర్యాటక పెట్టుబడులను ప్రోత్సహించడంతెలిసిందే. ఈ క్రమంలోనే మన్యం లో చలి ఉత్సవం పేరుతో పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించారు. అయితే.. దీనిని గిరిజనులు తప్పుగా అర్ధం చేసుకున్నారో.. లేక.. ఎవరైనా ప్రేరేపించారో తెలియదుకానీ.. గిరిజనులు.. తమ భూములు లాగేసుకుని.. పారిశ్రామిక వేత్తలకు అప్పగించే పన్నాగంలో భాగంగానే ప్రభుత్వం పర్యాటక ఉత్సవాలు.. పర్యాటక పెట్టుబడుల పేరుతో హడావుడి చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పర్యాటకానికి, పెట్టుబడులకు వ్యతిరేకంగా కదం తొక్కారు. ఎక్కడికక్కడ వాహనాలు ఆపేసి.. నిరసన, బంద్ పాటిస్తున్నారు. దీంతో మన్యం జిల్లా ఇప్పుడు గిరిజనుల ఆందోళనలు, నినాదాలు.. నిరసనలతో అల్లాడుతోంది.
సీఎం స్పందన ఏంటి?
“గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని మేము బలంగా నమ్ముతున్నాము. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెంబరు 3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశాం. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని… అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజన సోదరులను కోరుతున్నా. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్నాము.“ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.