ఆ 41 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్?

admin
Published by Admin — March 15, 2025 in Politics
News Image

మొదటి సారి అమెరికా అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కట్ చేస్తే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఆయన తీరు మారలేదు. ట్రంప్ 2.0లో కూడా ట్రావెల్ బ్యాన్ ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్, భూటాన్ లతో పాటు 41 దేశాల‌పై ట్రావెల్ బ్యాన్ విధించాలని ట్రంప్ ఆలోచిస్తున్నారట. ఆ దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో అడుగుపెట్ట‌కుండా ప్ర‌యాణ ఆంక్ష‌లు జారీ చేసేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

ఆ 41 దేశాల‌ను 3 గ్రూపులుగా విభజించారని తెలుస్తోంది. మొద‌టి గ్రూపులో 10 దేశాలు ఉన్నాయని, ఆ దేశాల పౌరుల‌కు వీసాల జారీని పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఆ గ్రూపులో ఆఫ్ఘ‌నిస్థాన్‌, ఉత్త‌రకొరియా, క్యూబా, ఇరాన్‌, సిరియా త‌దిత‌ర దేశాలున్నాయట. రెండో గ్రూపులో ఇరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ దేశాలున్నాయని, వాటిపై పాక్షిక ఆంక్ష‌లను అమ‌లు చేయ‌బోతున్నారని తెలుస్తోంది. ఆయా దేశాల వారికి పర్యాటక, విద్యార్థి వీసాలు, ఇతర వలస వీసాలను జారీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారట.

మూడో గ్రూపులో పాకిస్థాన్, భూటాన్ సహా మొత్తం 26 దేశాలుఉన్న‌ట్లు తెలుస్తోంది. 60 రోజుల్లోపు త‌మ లోపాలను పరిష్కరించుకునేందుకు ఆయా దేశాలు ప్రయత్నించకుంటే ఆయా దేశాల పౌరుల‌కు యూఎస్ వీసా జారీని పాక్షికంగా నిలిపివేస్తారట. ఈ జాబితా ఫైనల్ కాదని, మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.

Tags
41 countries travel ban USA usa president trump
Recent Comments
Leave a Comment

Related News