47 ఏళ్లు..చంద్రబాబు ఆల్ టైం రికార్డ్

admin
Published by Admin — March 13, 2025 in Politics, Andhra
News Image

47 ఏళ్ల రాజకీయ ప్రస్థానం…41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళుతున్న వైనం…4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం…10 సంవత్సరాలు ప్రతిపక్ష నేత….2 సార్లు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్…దేశంలోని ముఖ్యమంత్రులలో విజనరీ లీడర్ గా గుర్తింపు… ఇన్ని ఘనతలు సాధించిన ఏకైక నేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సరిగ్గా 47 ఏళ్ల క్రితం మార్చి 15న తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఓ టీడీపీ అభిమాని గుర్తు చేయడంతో చంద్రబాబు ఒక్కసారిగా గతంలోకి వెళ్లి ఆ జ్నాపకాలను నెమరువేసుకున్నారు.

తణుకు జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఏపీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రజలతో ఇష్టగోష్టి నిర్వహించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇదే రోజు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారని ఓ అభిమాని గుర్తు చేశారు. 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడాలని కోరారు. దీంతో, చంద్రబాబు గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 47 ఏళ్ల క్రితం తొలిసారి అసెంబ్లీకి వెళ్ళానని, 41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళుతున్నానని చెప్పారు.

పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశానని, తన జీవితమంతా అలుపెరుగని పోరాటం చేశానని చంద్రబాబు అన్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నానని చెప్పారు. 47 ఏళ్ల నుంచి ఎంత పనిచేశానో…రాబోయే 5, 10 ఏళ్లలో అంతకంటే రెట్టింపుగా పనిచేస్తానని అన్నారు. అయితే, అందుకు ప్రజా సహకారం కావాలని, 2047 నాటికి ఏపీకి దేశంలో నెంబర్ వన్‌గా చేస్తానని చంద్రబాబు చెప్పారు.

ఇలా ప్రజల దగ్గరకు వచ్చి ఏ సీఎం అయినా ప్రశ్నించేందుకు ఎవరికైనా మైక్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎవరైనా వచ్చినా పరదాలు కట్టుకుని వచ్చారు… విమానంలో తిరిగి వెళ్ళిపోయేవారని జగన్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు. ఇది ప్రజా ప్రభుత్వం అని, ప్రజలు ఏం చెప్పినా వినే ప్రభుత్వం అని అన్నారు. ప్రజలు తమ సమస్యలు తమతో చెప్పుకోవచ్చని, ఆ స్వేచ్ఛ ఉందని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరి సీఎంకు, ప్రజలకు మధ్య పరదాలు లేవని జగన్ కు చురకలంటించారు.

2004లో టీడీపీని గెలిపించి ఉంటే ఏపీ ఎక్కడికో వెళ్ళిపోయేదని, 2019లో పార్టీని గెలిపించి ఉంటే, విభజితాంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. గుజరాత్‌లో స్థిరమైన ప్రభుత్వం వలన అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. వైసీపీకి అధికారం ఇస్తే ఏపీని అంధకారంలోకి నెట్టేశారని, విపరీతంగా అప్పులు చేసి వెళ్లారని విమర్శించారు. ఏపీలో ఇప్పుడు ఉన్నది ప్రజాప్రభుత్వమని, సంక్షేమం..అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.

Tags
41 years in assembly 47 years all time record cm chandrababu
Recent Comments
Leave a Comment

Related News