ష‌ర్మిలతో విజ‌యసాయిరెడ్డి భేటీ అందుకేనా?

admin
Published by Admin — February 02, 2025 in Politics
News Image

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు విజ‌యసాయిరెడ్డి ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. త్వరలో వైసీపీని కూడా వీడి పొలం పనులు చేసుకుంటానని తెలిపారు. అయితే ఇంతలోనే జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో విజయ సాయి రెడ్డి భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని షర్మిల నివాసానికి వెళ్లిన విజయసాయిరెడ్డి.. ఆమెతో దాదాపు మూడు గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చలు జరిపారట. మధ్యాహ్నం అక్కడే ఉండి భోజనం కూడా చేశారని వార్తలు బయటకు రావడంతో వైసీపీలో కలకలం మొదలైంది. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచే జగన్, షర్మిల మధ్య కుటుంబ, రాజకీయ సంబంధాలు దెబ్బతిన్నాయి. అన్నాచెల్లెళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా విభేదాలు ఏర్పడ్డాయి. దాంతో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

సొంత చెల్లెలితో విభేదాలు, గత ఐదేళ్ల‌లో గతి తప్పిన పాలన కార‌ణంగా వైసీపీ 2024లో అధికారం కోల్పోయింది. ఆ తర్వాత కీలక నాయకులంతా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఈ జాబితాలో విజయసాయిరెడ్డి కూడా చేరారు. అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటున్న‌ట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి ఉన్నపలంగా ష‌ర్మిల‌తో భేటీ కావడం వెనుక ఏమైనా రాజకీయం ఉందా? అన్న చ‌ర్చ జోరుగా సాగుతోంది.

జ‌గ‌న్ తో ప్రయాణించడం వల్ల ఆయ‌న ఏ పని చేయమని ఆదేశిస్తే విజ‌య‌సాయిరెడ్డి ఆ పని చేసేవారు. అందులో భాగంగానే గతంలో పలుమార్లు షర్మిలపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ష‌ర్మిల‌ సైతం అంతే ధీటుగా విజయసాయిరెడ్డి పై ఘటైన విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేస్తున్న త‌రుణంలో ష‌ర్మిల దెబ్బతిన్న సంబంధాలను మళ్లీ పునరుద్ధరించుకోవడానికే విజ‌య‌సాయిరెడ్డి ఆమెతో భేటీ అయ్యార‌ని టాక్ న‌డుస్తోంది.

Tags
Andhra Pradesh AP News ap politics
Recent Comments
Leave a Comment

Related News