30 ప్ర‌శ్న‌లు.. మూడే స‌మాధానాలు.. ఏంటిది వంశీ ?

admin
Published by Admin — February 26, 2025 in Politics, Andhra
News Image

టీడీపీ ఆఫీస్‌లో ప‌ని చేసే స‌త్య‌వ‌ర్థ‌న్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీ ని పోలీసులు క‌స్ట‌డీకి తీసుకున్నారు. అయితే తొలి రోజు విచార‌ణ‌లో పోలీసుల‌కు వంశీ `అదుర్స్‌` మూవీని గుర్తు చేశార‌ట‌. మూడు రోజుల కస్టడీలో భాగంగా నిన్న ఉదయం 11 గంటలకు జైలు నుంచి వంశీతో పాటు మిగ‌తా నిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తొలుత ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు చేయించారు.

అనంత‌రం విచార‌ణ నిమిత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రెండున్న‌ర గంట‌ల పాటు సాగిన విచార‌ణ‌లో.. ముగ్గురు ఏసీపీలు వంశీని విచారించారు. కిడ్నాప్ కేసుకు సంబంధించిన ప‌లు ఆధారాల‌ను వంశీ ముందుంచి దాదాపు 30 వ‌ర‌కు ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. అయితే పోలీసుల విచార‌ణ‌లో వంశీ త‌న‌కు సత్యవర్ధన్ ఎవ‌రో కూడా తెలియ‌ద‌ని చెప్పే ప్ర‌యత్నం చేశార‌ట‌. సీసీ ఫుటేజ్ చూపించి ప్ర‌శ్నించ‌గా.. రాయదుర్గంలోని త‌న ఇంట్లో ఒక రాత్రంతా స‌త్య‌వ‌ర్థ‌న్ విశ్రాంతి తీసుకున్నాడని, మరుసటి రోజు తమ వారితో కలిసి కారులో వెళ్లిపోయాడని.. అతడే సత్యవర్ధన్ అని తనకు తెలియదని వంశీ చెప్పార‌ట‌.

టీడీపీ ఆఫీస్ పై దాడి కేసును ఉపసంహరించుకునేలా సత్యవర్థన్‌పై ఎందుకు ఒత్తిడి తెచ్చారని ప్ర‌శ్నించ‌గా.. తాము సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయలేదని.. అతడితో తనకేం సంబంధం లేదని వంశీ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. మీరు వాడే మూడు ఫోన్లను ఎక్కడ ఉన్నాయ‌ని ప్ర‌శ్నించ‌గా.. గుర్తుకు రావడం లేదన్నారట‌. పోలీసులు దాదాపు ముప్పై ప్ర‌శ్న‌ల‌కు అడిగితే.. చాలా వాటికి వంశీ `తెలీదు.. గుర్తులేదు.. మ‌ర్చిపోయాను` అంటూ అదుర్స్ సినిమాలోని డైలాగ్ ను రిపీట్ చేశార‌ని స‌మాచారం. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు అస‌త్యాలు చెప్పార‌ట‌. ఇక మూడు ఫోన్ల‌లో ఒక ఫోన్ ను మాత్ర‌మే పోలీసుల‌కు ఇచ్చార‌ని తెలుస్తోంది. ఇక విచార‌ణ అనంత‌రం వంశీతో స‌హా మిగ‌తా నిందితుల‌కు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో మ‌ళ్లీ వైద్య ప‌రీక్ష‌లు చేయించి జైలుకు అప్ప‌గించారు. కాగా, గ‌తంలో విధించిన రిమాండ్ గ‌డువు ముగియ‌నుండ‌టంతో తాజాగా విజ‌య‌వాడ‌లోని ఎస్సీ, ఎస్టీ స్పెష‌ల్ కోర్టు మార్చి 11 వ‌ర‌కు వంశీ రిమాండ్ ను పొడిగించింది.

Tags
Andhra Pradesh AP News ap politics
Recent Comments
Leave a Comment

Related News