కేంద్ర బ‌డ్జెట్ పై బొత్స విమ‌ర్శ‌లు.. సాయిరెడ్డి ప్ర‌శంస‌లు!

admin
Published by Admin — February 02, 2025 in Politics, Andhra
News Image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శ‌నివారం పార్లమెంట్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. మొత్తం రూ.50,65,345 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ‌పెట్టారు. ఈ బడ్జెట్‌లో వేతనజీవులకు భారీ ఊరట ల‌భించింది. రూ.12 లక్షల వరకు టాక్స్‌ మినహాయింపునిస్తూ నిర్మ‌ల‌మ్మ ప్ర‌క‌టక చేయ‌డంతో.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక‌పోతే కేంద్ర బ‌డ్జెట్ పై విజ‌య‌ సాయిరెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు.

ఇటీవ‌ల ఎంపీ ప‌ద‌వికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సాయిరెడ్డి.. ఎక్స్ వేదిగా బ‌డ్జెట్ పై ట్వీట్ చేశారు. `2025 బడ్జెట్ మధ్యతరగతి బడ్జెట్ గా గుర్తుండిపోతుంది. గౌరవనీయమైన నిర్మ‌లా సీతారామ‌న్ గారికి ఇది వ‌రుస‌గా 8వ బ‌డ్జెట్ కావ‌డం ఒక రికార్డు. భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు, తగ్గిన కస్టమ్ డ్యూటీలు మరియు బలమైన ఆర్థిక సంస్కరణలతో ఈ బడ్జెట్ కష్టపడి పనిచేసే కుటుంబాలను శక్తివంతం చేస్తుంది మరియు దేశం యొక్క అభివృద్ధి పథాన్ని బలోపేతం చేస్తుంది.` అని విజ‌య‌సాయిరెడ్డి త‌న ట్వీట్ లో పేర్కొన్నారు.

అయితే మ‌రోవైపు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కేంద్ర బ‌డ్జెట్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. స‌భ‌లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూ నిర్మలా సీతారామన్ ఏపీకి చెందిన మహాకవి గురజాడ అప్పారావు కవితను ప్రస్తావించారు కానీ రాష్ట్రానికి కేటాయింపులు మాత్రం మరిచిపోయార‌ని బోత్స మండిప‌డ్డారు. బీహార్ భారీగా లబ్ధి పొందింది.. కానీ ఏపీకి ఎటువంటి ప్రాధాన్య దక్కలేదన్నారు. ఈ బడ్జెట్ లో బీహార్ తో పోలిస్తే ఏపీకి దక్కింది శూన్యమ‌న్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉన్నా.. టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వారంతా విఫలమయ్యారని బొత్స విమర్శలు చేశారు. టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవంటూ ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తుంటే.. కేంద్రం దానిని 41 మీటర్లకు కుదించి నిధుల కేటాయింపునకు అంగీక‌రించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. పోల‌వ‌రం ఎత్తు కుదింపుపై కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని బోత్స డిమాండ్ చేశారు.

Tags
Andhra Pradesh Botsa Satyanarayana Budget 2025
Recent Comments
Leave a Comment

Related News