పోసాని అరెస్ట్ పై వైసీపీ రియాక్ష‌న్..!

admin
Published by Admin — February 27, 2025 in Politics, Andhra
News Image

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. గత రాత్రి హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన అగ్ర నేతలపై అడ్డు అదుపు లేకుండా పోసాని ఏ విధంగా నోరు పారేసుకున్నారో, ఎటువంటి అడ్డగోలు ఆరోపణలు చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా రెచ్చిపోయిన పోసాని ఇప్పుడు దాని పరిణామాలు ఎదుర్కొంటున్నారు.

చంద్రబాబు, పవన్ క‌ళ్యాణ్‌ల‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు.. కులాల పేరుతో దూషించి ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసు స్టేషన్‌లో పోసానిపై కేసు పెట్టారు జనసేన నేత జోగినేని మణి. ఈ కేసులోనే పోసానిపై సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం రాత్రి పోసాని కృష్ణ మురళి నివాసానికి వెళ్లి నోటీసులు అందించి, అరెస్టు చేశారు. అరెస్ట్ స‌మ‌యంలో హైడ్రామా చోటుచేసుకుంది. పోలీసుల‌పై పోసాని చిందులు తొక్కారు. `మీరెవరు? ఎలా మా ఇంటికి వస్తారు? నేను నోటీసులు తీసుకోను.. అరెస్టు చేసుకోండి` అంటూ పోసాని ఆగ్రహించారు. కొంత‌సేపు వాగ్వాదం అనంత‌రం పోసాని పోలీసుల‌తో వ‌చ్చారు. గురువారం రాజంపేట కోర్టులో ఆయ‌న్ను హాజరుపరబోతున్నారు.

అయితే పోసాని అరెస్ట్ పై వైసీపీ రియాక్ట్ అయింది. శివరాత్రి పూట రెడ్ బుక్ రాజ్యాంగంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రెచ్చిపోతుంద‌ని.. రాజకీయ కక్ష సాధింపే లక్ష్యంగా అక్రమ అరెస్టులు చేప‌ట్టింద‌ని వైసీపీ మండిప‌డింది. ఇంట్లోకి అక్రమంగా చొరబడి పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశార‌ని.. ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నా ఆయ‌న‌తో దురుసుగా ప్రవర్తించిరాని ఎక్స్ వేదిక‌గా వైసీపీ రాసుకొచ్చింది. పోలీసులు డ‌బుల్ గేమ్ ఆడుతున్నార‌ని.. కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్టు సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్ గా పేర్కొని.. ఫోన్ నంబర్ లో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ అని చెప్పారంటూ వివ‌రించింది. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుండి కేసును డ్రైవ్ చేస్తున్నటుగా అనుమానాలు వ్య‌క్తం చేసింది. రేపటి డేట్ లో అరెస్టు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం నోటీస్ ఇచ్చి ఈరోజే అక్రమంగా అరెస్టు చేయడం ఏంటి? అంటూ వైసీపీ ప్ర‌శ్నించింది.

మ‌రోవైపు పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసానిని అరెస్ట్ చేశార‌ని.. రేపటి డేట్ తో పోసానికి నోటీసులు జారీ చేయడం వెనుక పోలీసుల అత్యుత్సాహం క‌నిపిస్తుంద‌ని ప్ర‌కాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కూట‌మి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్ప‌డుతుంద‌ని.. చంద్రబాబు తప్పిదాలను విమర్శించిన పోసాని కృష్ణమురళి పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్ట‌డం దుర్మార్గమ‌ని వైసీపీ నేత ప్రకాష్ రెడ్డి దుయ్య‌బ‌ట్టారు.

Tags
Andhra Pradesh AP News ap politics
Recent Comments
Leave a Comment

Related News