అర్థ‌రాత్రి రెండింటికి వాద‌న‌లు.. పోసాని కి 14 రోజుల రిమాండ్‌

admin
Published by Admin — February 28, 2025 in Politics, Andhra
News Image

న‌టుడు, ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళికి.. క‌డ‌ప జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయ‌నను రాజంపేటలోని జిల్లా సబ్‌జైలుకు తరలించారు. కాగా.. పోసాని అరెస్టు త‌ర్వాత‌.. గుర‌వారం ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు .. ఉన్న‌తాధికారి ఎస్పీ స‌మ‌క్షంలో ఆయ‌న‌ను విచారించారు. అన్ని ర‌కాలుగా ఆయ‌న‌ను ప్ర‌శ్నించారు. అయితే.. ప్ర‌తి ప్ర‌శ్న‌కూ పోసాని పొంతన‌లేని స‌మాధానం ఇచ్చారు.

ఒకానొక ద‌శ‌లో `తీవ్ర చ‌ర్య‌లు` తీసుకుంటామ‌ని ఎస్పీ హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు అరెస్టు చేసిన 24 గంట‌ల్లోగా.. కోర్టులో హాజ‌రు ప‌ర‌చాల్సిన నిబంధ‌న ఉన్న నేప‌థ్యంలో రాత్రి 9.30 గంట‌ల స‌మ యంలో రైల్వే కోడూరులోని కోర్టులో పోసానిని హాజ‌రు ప‌రిచారు. అయితే.. అప్ప‌టికే వైసీపీ నాయ‌కులు అక్క‌డ‌కు చేరుకోవ‌డం, వారి త‌ర‌ఫున న్యాయ‌వాదులు కూడా.. సిద్ధంగా ఉండ‌డంతో న్యాయాధికారి.. రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో వాద‌న‌లు వినేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఇటు పోలీసుల త‌ర‌ఫున, అటు వైసీపీ త‌ర‌ఫున న్యాయ‌వాదులు హోరా హోరీగా వాద‌న‌లు వినిపించారు. పోసాని అరెస్టును అక్ర‌మ‌మ‌ని వైసీపీ న్యాయ‌వాదులు పేర్కొన్నారు. దీనికి ప్ర‌తిగా తాము అన్ని నిబంధన లు పాటించే అరెస్టు చేశామ‌ని, దీనిలో ఎక్క‌డా త‌ప్పు జ‌ర‌గ‌లేద‌ని.. బ‌ల‌మైన ఫిర్యాదులు ఉన్నాయ‌ని పోలీసుల త‌ర‌ఫున న్యాయ‌వాదులు స్ప‌ష్టం చేశారు. ఇరు ప‌క్షాలు వాద‌న‌లు అర్ధ‌రాత్రి 2.30 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగాయి. సుమారు ఐదు గంట‌ల పాటు ఈ ప్ర‌క్రియ కొన‌సాగింది.

ఇరు ప‌క్షాల వాదన‌లు పూర్తి కావ‌డంతో పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున 5.30 గంట‌ల స‌మ‌యంలో రైల్వేకోడూరు కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో మార్చి 13వ తేదీ వ‌ర‌కు పోసాని జైల్లోనేఉండ‌నున్నారు. అయితే.. ఈ రోజు ఉద‌యం ఆయ‌న‌కు సంబంధించి బెయిల్ పిటిష‌న్‌ను దాఖ‌లు చేయ‌నున్న‌ట్టు వైసీపీ త‌ర‌ఫున న్యాయ‌వాదులు తెలిపారు. ఇదిలావుంటే.. పోలీసులు త‌మ క‌స్ట‌డీకి కోరుతూ.. మ‌రో పిటిష‌న్ శుక్ర‌వారందాఖ‌లు చేయ‌నున్నారు. 5 రోజుల పాటు త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఉన్నాయ‌ని వారు చెబుతున్నారు.

Tags
Andhra Pradesh AP Police cm chandrababu
Recent Comments
Leave a Comment

Related News