సాయిరెడ్డి పై గుడివాడ అమ‌ర్నాథ్ కౌంట‌ర్ ఎటాక్‌!

admin
Published by Admin — March 13, 2025 in Politics, Andhra
News Image

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధ‌వారం విజయవాడలో మీడియా ఎదుట ఫ్యాన్ పార్టీ అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. కాకినాడ పోర్టు వాటాల‌ను బ‌ల‌వంతంగా లాగేసుకున్న కేసులో సిఐడి విచార‌ణ‌కు హాజ‌రైన విజ‌య‌సాయిరెడ్డి.. జగన్ చుట్టూ కోటరీ తయారైంద‌ని… ఆ కోటరీ వల్లే త‌న‌కు జగన్ వ‌ద్ద విలువ లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జగన్ చుట్టూ ఏర్పడిన కోటరీ ఆయనకు నిజాలు తెలియకుండా చేస్తుందని.. నాయకుడు చెప్పుడు మాటలు వినడం మొదలుపెడితే అది అత‌ని భావిష్య‌త్తుకు, ప్ర‌జ‌ల‌కు పెను ప్ర‌మాదంగా మారుతుంద‌ని సాయిరెడ్డి హెచ్చ‌రించారు.

అలాగే కాకినాడ పోర్టు వ్య‌వ‌హారంలో త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని.. చేసిందంతా వై.వి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అంటూ కుండ‌బ‌ద్ద‌లుకొట్టారు. అయితే సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ రియాక్ట్ అయ్యారు. సాయిరెడ్డిపై కౌంట‌ర్ ఎటాక్ చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ప్రజలు, కార్య‌క‌ర్త‌లేన‌ని.. అయినా ఏ పార్టీలో కోటరీ ఉండదో చెప్పండని అమ‌ర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా? అని అడిగారు.

మొన్నటి వరకు కోటరీలో ఉన్న ఆయ‌నే… ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌ని విజ‌యసాయిరెడ్డికి అమ‌ర్నాథ్ చుర‌క‌లు వేశారు. పార్టీ మారిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వర్గాలు ఉన్నాయ‌ని.. ఒకటి కూటమి వర్గం, రెండోది వైసీపీ వర్గం, మూడవది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గమ‌ని.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులను అనుభవించిన వాళ్లు ఇప్పుడు కూట‌మి అధికారంలోకి రాగానే పార్టీలు మారుతున్నారని అమ‌ర్నాథ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒకవేళ‌ వైసీపీ అధికారంలో ఉండంటే పార్టీని వీడేవారా? అంటూ నిల‌దీశారు. విజ‌య‌సాయిరెడ్డి ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల‌ని అమ‌ర్నాథ్ సూచించారు.

Tags
Andhra Pradesh AP News ap politics gudivada amarnath
Recent Comments
Leave a Comment

Related News