మ్యాగజైన్ స్టోరీ…అప్పులు తీర్చడానికేనట!

admin
Published by Admin — March 13, 2025 in Politics, Andhra
News Image

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్‌ నిర్విరామంగా కృషిచేశారు. ఢిల్లీ వెళ్లిన ప్రతి సారీ ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక, ఉక్కు మంత్రులు నిర్మలా సీతారామన్‌, హెచ్‌డీ కుమారస్వామిని కలిసి.. నష్టాల బారి నుంచి బయటపడేయాలని.. తగు ఆర్థిక సాయం అందిస్తే తప్పకుండా అప్పులు తీరి లాభాల్లోకి వస్తుందని నచ్చజెప్పారు. 2014-24 నడుమ లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉన్న కాలంలో.. మోదీ ప్రభుత్వం దశలవారీగా దానిని ప్రైవేటీకరించాలని చూసింది.


2019-24 మధ్య అధికారంలో ఉన్న జగన్‌ ఇందుకు పూర్తిగా సహకరించారు. స్టీల్‌ ప్లాంటుకు రాష్ట్రప్రభుత్వం సేకరించి ఇచ్చిన భూములను తీసుకుని అక్కడ రాజధానిని నిర్మించాలని కలలు గన్నారు. ఆ ఉద్దేశంతోనే స్టీల్‌ ప్లాంటును అమ్మడానికి కంపెనీలను కూడా తీసుకురావాలని ప్రయత్నించారు. అయితే అప్పటికే జిందాల్‌, అదానీ లైన్‌లో ఉండడంతో మోదీ చెప్పినట్లు చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే గాక అంతకుముందు కూడా లోకేశ్‌, చంద్రబాబు స్టీల్‌ ప్లాంటును పరిరక్షించి తీరతామని శపథం చేశారు.


గద్దెనెక్కాక ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పవచ్చు. కేంద్రంపై వారు తెచ్చిన ఒత్తిడి ఫలితమిచ్చింది. స్టీల్‌ ప్లాంటును ఆదుకోవడానికి మోదీ ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. అధికారంలో కొనసాగాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరైన పరిస్థితుల్లో ప్రధాని మోదీ కూడా రూటు మార్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీని బహుమతిగా ప్రకటించారు. వాస్తవానికి స్టీల్‌ ప్లాంటు నష్టాల్లో ఉండడంతో పెట్టుబడులు ఉపసంహరించాలని కేంద్ర కేబినెట్‌ గతంలోనే నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ రంగ సంస్థను కాపాడాలని, ప్యాకేజీ ప్రకటించాలని.. కనీసం బ్యాంకుల ద్వారానైనా రుణాలు ఇప్పించాలని కోరినా గతంలో వినిపించుకోలేదు. అంతెందుకు.. మోదీ 3.0 ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ఇదే కోరినా.. కుదరదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఇదే సమయంలో చంద్రబాబు లేఖాస్త్రం సంధించారు. స్వయంగా మోదీని కలిశారు.


రాష్ట్ర ప్రతిష్ఠతో ముడిపడిన స్టీల్‌ప్లాంట్‌.. ప్రజల భావోద్వేగానికి సంబంధించిందని.. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో అది ఏర్పాటైందని గుర్తుచేశారు. నిర్మలా సీతారామన్‌కు కూడా వినతులు సమర్పించారు. చివరకు మోదీ సానుకూలత వ్యక్తంచేశారు. అటు కుమారస్వామి కూడా ఆయనతో పాటు నిర్మలతో చర్చలు జరిపారు. ‘ఓసారి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు తెల్లవారుజామున 1.30 గంటలకు ఆర్థిక మంత్రి అపాయింట్‌మెంట్‌ ఇస్తే… ఓపికగా వేచి ఉండి ఆమెతో సమావేశమై చర్చించారు.

అంతటి చిత్తశుద్ధి చూపించబట్టే ఆర్థిక ప్యాకేజీ దక్కింది’ అని కుమారస్వామి స్వయంగా వెల్లడించడం గమనార్హం. స్టీల్‌ప్లాంట్‌ను నిలబెడతామని హామీ ఇచ్చామని, దాన్ని నిలుపుకోవడానికి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రత్యేకంగా కోరారు. విశాఖ ఎంపీ శ్రీభరత్‌, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు.. ఇలా అందరూ కలిసి ఒత్తిడి తేవడం వల్లే సాధ్యమైందన్నారు.

అంతా కలిసి పనిచేస్తే సాధ్యమే..

ఈ ప్యాకేజీని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి, ఉద్యోగ, కార్మిక వర్గాలకు వివరించేందుకు కుమారస్వామి స్వయంగా విశాఖకు వచ్చారు. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దేశంలో నంబర్‌వనగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. దీనికి ఉద్యోగులు, కార్మికులు సహకరించాలి. వికసిత్‌ భారత్‌లో భాగంగా 2030 నాటికి 300 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని ప్రధాని మోదీ లక్ష్యం విధించారు. దానిని సాధించడానికి అందరం చిత్తశుద్ధితో పనిచేయాలి.

వాస్తవానికి గతంలో ఈ స్టీల్‌ప్లాంట్‌ మంచి లాభాల్లో ఉండేది. 3 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేసినప్పుడు రూ.1,300 కోట్ల లాభం వచ్చింది. అప్పుడే నవరత్న హోదా వచ్చింది. 2015-16లో ఆరు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి కోసం విస్తరణకు వెళ్లారు. ఈ క్రమంలో అప్పులు తీసుకున్నారు. తర్వాత సొంత గనులు, ఎటువంటి ముడిపదార్థాల భరోసా లేకుండా మరో మిలియన్‌ టన్ను ఉత్పత్తి సామర్థ్యం పెంచారు.


అక్కడి నుంచి తిరోగమనం ప్రారంభమైంది. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జూలైలో ఇక్కడకు వచ్చా. అప్పుడు రూ.26 వేల కోట్ల అప్పులు ఉండేవి. ఇప్పుడు రూ.35 వేల కోట్లకు పెరిగాయి. ఇటువంటి సంస్థకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడం అసాధ్యమే అయినా చంద్రబాబు, లోకేశ్‌ సహా రాష్ట్ర నాయకులంతా కలిసి ఒత్తిడి తేవడం వల్ల సాధ్యమైంది. నిజానికి మేమంతా రూ.17 వేల కోట్ల సాయం అడిగాం. తొలుత రూ.1,650 కోట్లు ఇచ్చి, మొత్తం ప్యాకేజీ రూ.11,440 కోట్లుగా ప్రకటించారు.

ప్రస్తుతం రెండు బ్లాస్ట్‌ ఫర్నేసుల ద్వారా 14వేల టన్నుల ఉత్పత్తి అవుతోంది. ఇదే స్ఫూర్తితో మరింత కష్టపడి మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను కూడా ప్రారంభించి ఉత్పత్తిని 20 వేల నుంచి 24వేల టన్నులకు పెంచాలి’ అని సూచించారు. ఆ లక్ష్యం సాధించగలిగితే కష్టాలన్నీ తీరిపోతాయని, ఏడాదిలోనే స్టీల్‌ప్లాంట్‌ లైన్‌లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రధానికి తాను ఇదే విషయం చెప్పానన్నారు. ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, రెండు, మూడు నెలలు ఆగితే ప్రతినెలా జీతం ఇచ్చేందుకు యత్నిస్తామని ఉద్యోగులు, కార్మికులకు భరోసా ఇచ్చారు. ఇకపై తరచూ స్టీల్‌ప్లాంట్‌కు వచ్చి, అభివృద్ధిని సమీక్షిస్తానని చెప్పారు.

సైంధవుల్లా కేంద్ర అధికారులు..

రాజకీయ కోణంలో ఫ్యాక్టరీ సమస్య పరిష్కారానికి నాయకులు చేసిన ప్రయత్నం చాలా వరకు సానుకూల ఫలితాలిచ్చింది. కానీ కేంద్ర ఉక్కు శాఖ అధికారులు మాత్రం సైంధవుల్లా తయారయ్యారు. ఎలాగైనా విక్రయించాలనే కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది. మోదీ సర్కారు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే వీరు మాత్రం పీటముడి వేయాలని చూస్తున్నారు. ఉద్యోగులను అయోమయంలోకి నెడుతున్నారు. ఉక్కు కార్యదర్శి సందీప్‌ పౌండ్రక్‌ ఇటీవల కుమారస్వామి పర్యటనకు ముందు రోజు ఢిల్లీ నుంచి విశాఖ వచ్చారు.

ప్లాంటులో ఎంపిక చేసిన 250 మంది యువ ఎగ్జిక్యూటివ్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒక్క సానుకూల మాట మాట్లాడిన పాపానపోలేదె. ‘కేంద్రం అందిస్తున్న రూ.11,440 ప్యాకేజీని బ్యాంకుల రుణాలు, అప్పులు తీర్చడానికే ఉపయోగిస్తారు. ఇంతకు ముందు అందజేసిన రూ.1,650 కోట్లు ఈ కొత్త ప్యాకేజీ రూ.11,440 కోట్లలో భాగమే. మూడు బ్లాస్ట్‌ ఫర్నేసులను పూర్తిస్థాయిలో నడపాల్సిన బాధ్యత ఉద్యోగులదే. జీతాలు, బకాయిలు, పదోన్నతులు, ఇంక్రిమెంట్ల విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకోదు.


స్థానిక యాజమాన్యమే దానికి బాధ్యత వహిస్తుంది. వారితోనే మాట్లాడుకోవాలి. స్టీల్‌ప్లాంటుకు సొంత గనులు కేటాయించే పరిస్థితి లేదు. సెయిల్‌లో విలీనం చేయడం కూడా కుదరదు. ప్రైవేటీకరణ అంశంపై పార్లమెంటులో నిర్ణయం తీసుకోవాలి. దానిని లాభాల్లోకి తీసుకురావడం ఉద్యోగులు, కార్మికుల బాధ్యతే’ అని చెప్పడం కలకలం రేపింది. ఇక్కడ జీతాలు అడిగితే ఢిల్లీ అధికారులు చెబితేనే ఇస్తామని ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. పూర్తి జీతాలు ఇవ్వకుండా ఆపుతున్నది ఢిల్లీ పెద్దలేనని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో సెక్రటరీ వ్యాఖ్యలు వారిలో మరింత భయానికి కారణమయ్యాయి. ఇంకోవైపు.. రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఎలా ఉపయోగిస్తారనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో అనేక సందేహాలున్నాయి. ఆగస్టులో ప్రారంభిస్తామని ప్రకటించిన బ్లాస్‌ ఫర్నేస్‌-3 కోసం అవసరమైన ముడి పదార్థాలను.. కమీషన్ల కోసం ఇప్పుడే కొనడానికి ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి బీజేపీలో కొందరు నాయకులు సహకరిస్తున్నారు. ఆరు నెలల ముందే ముడి పదార్థాలు కొనే సంప్రదాయం ప్లాంటులో లేదు.

అవి అంత ముందుగా కొని పెట్టుకోవలసినవి కూడా కావు. కోట్ల రూపాయల్లో వచ్చే కమీషన్లకు ఆశ పడి కొందరు ఉన్నత స్థాయిలో చేస్తున్న అవినీతి ఇది. తప్పుడు నిర్ణయాలన్నీ యాజమాన్యం తీసుకొని, కార్మికులు, ఉద్యోగుల వల్ల నష్టాలు వస్తున్నాయని ప్రచారం చేయడం పరిపాటిగా మారింది.

Tags
central minister kumaraswamy clearing debts cm chandrababu
Recent Comments
Leave a Comment

Related News