మ్యాగజైన్ స్టోరీ: సెకీ ఒప్పందంపై జగన్ నీచ పత్రిక అసత్యాలు

admin
Published by Admin — March 25, 2025 in Politics, Andhra
News Image

జగన్ తన నీచ పత్రిక ద్వారా అసత్యాలు వండివారుస్తున్నారు. సోలార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో తాను అడ్డగోలుగా పాతికేళ్ల కాలానికి కుదుర్చుకున్న 7 వేల మెగావాట్ల సరఫరా ఒప్పందాన్ని సమర్థించుకునేందుకు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత నియంత్రణ కమిషన్‌ (ఏపీఈఆర్‌సీ)ని పావుగా వాడుకోవాలని చూశారు. దాని ఉత్తర్వులు, వ్యాఖ్యలకే వక్ర భాష్యాలు చెప్పారు. సెకీ ఒప్పందం సక్రమమేనంటూ ఈఆర్‌సీ చెప్పిందంటూ ఆయన పత్రిక కల్పిత కథనాన్ని వండి వార్చింది.


పనిలోపనిగా ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా అక్కసు వెళ్లగక్కింది. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్లుగా దాని కథనం సాగింది. జగన్‌ సర్కారు 2021లో సెకీతో 7,000 మెగావాట్ల సౌర విద్యుత కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. పేరుకే ‘సెకీ’! అసలు సరఫరాదారు మాత్రం అదానీ! ఈ ఒప్పందం రాష్ట్రానికి పెనుభారంగా పరిణమిస్తుందని… పాతికేళ్లపాటు జనానికి షాకులు తప్పవని నిపుణులు హెచ్చరించారు. అంతర్రాష్ట్ర సరఫరా చార్జీల (ఐఎస్‌టీఎస్‌) రూపంలో చాలా భారం పడుతుందని తెలిపారు. భవిష్యతలో సౌర విద్యుత ధర మరింత తగ్గే అవకాశమున్నా.. ముందుచూపులేకుండా దీర్ఘకాలిక ఒప్పందం చేసుకోవడం సరికాదన్నారు.


ఈ అభ్యంతరాలేవీ నాడు జగన్‌ పట్టించుకోలేదు. ఇతర చార్జీలు ఉండవని, ట్రాన్సమిషన చార్జీలపై పూర్తి మినహాయింపు ఉంటుందని ఒప్పందం చేసుకునే సమయంలో ఊదరగొట్టారు. అవన్నీ అవాస్తవాలేనని తర్వాత వెల్లడైంది. సెకీతో విద్యుత కొనుగోలు ఒప్పందం వెనుక భారీగా అవినీతి జరిగిందని, కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టులోనూ, కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ)లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. దాఖలుచేసినవారిలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఉన్నారు.

వీటిపై ఇంకా విచారణ జరుగుతోంది. అలాగే… సెకీతో ఒప్పందాల కోసం ‘అదానీ’ సంస్థ ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు లంచాలు ఇచ్చిందంటూ ఏకంగా అమెరికా దర్యాప్తు సంస్థ, న్యాయ విభాగం బయటపెట్టాయి. దీంతో ఇది అంతర్జాతీయ స్థాయి వివాదంగా మారింది.
మసిపూసి.. మాయ చేసి!


అసలు విషయం, వివాదం అలాగే ఉన్నప్పటికీ… జగన్‌ పత్రిక మాత్రం ‘సెకీ ఒప్పందానికి ఈఆర్‌సీ క్లీన్‌చిట్‌ ఇచ్చేసింది’ అంటూ తాజాగా కథనం ప్రచురించింది. ‘ఈఆర్‌సీచెప్పింది’ అంటూ తనకు ఇష్టమొచ్చినట్లు రాసేసుకుంది. అయితే అది చెప్పినట్లుగా.. ‘సెకీ ఒప్పందం సక్రమమే, అందులో ఎలాంటి లోపాలు లేవు, అందువల్ల రద్దు చేయడం కుదరదు’ అని ఏపీఈఆర్‌సీఎక్కడా చెప్పలేదు. ఈ ఒప్పందానికి క్లీన్‌ చిట్‌ కూడా ఇవ్వలేదు. దీనిపై హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైనందున తాను సొంతంగా ఒప్పందాన్ని రద్దు చేయలేనని స్పష్టం చేసింది.

‘సెకీ విద్యుత సేకరణలో లంచాలకు సంబంధించి మీడియా కథనాలను బట్టి ఏపీఈఆర్‌సీ ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయాలని కొందరు కోరారు. దీంతో ఈ పీఎస్‌ఏపై ఏపీఈఆర్‌సీ మరోసారి దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించింది’ అని ఈఆర్‌సీ పేర్కొన్నట్లు సాక్షిలో రాశారు. సెకీ ఒప్పందంపై అభ్యంతరాలు రావడం, దానిని రద్దు చేయాలని కోరడం నిజమే. సెకీ ఒప్పందంపై ఇప్పటికీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఒప్పందం అమలవుతుందని ఈఆర్‌సీ తేల్చి చెప్పింది.

అదే సమయంలో… లంచాలు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఒప్పందాన్ని తమంతట తాము రద్దు చేయలేమని తెలిపింది. దీనికి కారణం… ఈ వివాదం కోర్టు పరిధిలో ఉండడమే. అయినా సరే… ‘హైకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించింది’ అన్నట్లుగా సాక్షి రాసేసింది. ఏపీఈఆర్‌సీ పరిశీలించిన తీర్పులేమిటో దానికే తెలియాలి. అలాగే ‘కేంద్ర విద్యుత శాఖ ఆదేశాలు, సెంట్రల్‌ రెగ్యులేషన్‌ కమిషన్‌, పనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ నిబంధనలు, పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ ప్రకారం… సెకీ విద్యుతకు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు (ఐఎస్‌టీఎస్‌) వర్తించవు’ అని ఈఆర్‌సీ పేర్కొన్నట్లు కూడా తెలిసింది.


ఇది కూడా శుద్ధ అబద్ధం. సెకీ విద్యుతకు ఐఎస్‌టీఎస్‌ నుంచి మినహాయింపు ఉందని ఈఆర్‌సీ ఎక్కడా చెప్పలేదు. దీనిపై గత ఆగస్టు 13న స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎస్‌టీఎస్‌ చార్జీల మినహాయుంపు పొందాల్సిన బాధ్యత సెకీదేనని తెలిపింది. అలా చేయలేకపోతే.. జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సిస్‌ (జీఎన్‌ఏ) రెగ్యులేషన్స్‌లోని 20.4 క్లాజ్‌ ప్రకారం స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ యూనిట్‌ (ఎస్‌టీయూ)నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకుని ‘జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెస్‌’కు దరఖాస్తు చేసుకోవాలని ఏపీఆర్‌ఏపీఎస్‌సీఓఎం (గ్రామీణ వ్యవసాయ విద్యుత సరఫరా సంస్థ)కు సూచించింది. అంతే తప్ప.. సెకీ ఒప్పందానికి ఐఎస్‌టీఎస్‌ చార్జీల నుంచి మినహాయింపు ఉందని చెప్పలేదు.

జీఎన్‌ఏ నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. అయినా వాటి ప్రకారం మినహాయింపు ఇచ్చినట్లు రాసేసింది. సెకీ విద్యుత కొనుగోలుకు అనుమతించాల్సిందిగా డిస్కమ్‌లు ప్రతిపాదించినట్లు చెప్పుకొచ్చింది. సాంకేతికంగా చూస్తే సెకీతో ఒప్పందం అమలులో ఉన్నట్లే. దీనిని ఆపివేస్తూ ఎలాంటి ఉత్తర్వులూ, తీర్పులూ లేవు. అమలులో ఉన్న ఇతర ఒప్పందాల ప్రకారం విద్యుత సమీకరణకు అవకాశం కల్పించినట్లే ‘సెకీ’ ఒప్పందాన్ని కూడా ఏఆర్‌ఆర్‌లో చేర్చారు. ఇది… సెకీ డీల్‌కు క్లీన్‌ ఇచ్చినట్లు కాదు.

ఇవీ వాస్తవాలు

సెకీతో ఒప్పందానికి ఈఆర్‌సీ క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లుగా ‘రోత పత్రిక’ ఒక చిత్రాన్ని ప్రచురించింది. అందులో అక్షరం అక్షరం చదివినా… ఎక్కడా ‘క్లీన్‌ చిట్‌’ ఇచ్చినట్లు కనిపించదు. ఒప్పందం నేపథ్యం, అభ్యంతరాలను వివరిస్తూ… కోర్టు పరిధిలో ఉన్నందున తనంతట తానుగా ఒప్పందం రద్దు చేయలేనని మాత్రమే తెలిపింది. 2021లో సెకీతో విద్యుత కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్‌కు రూ.2.49 చెల్లించాలి. అప్పటికే గుజరాత సెకీతో యూనిట్‌కు రూ.1.90కే ఒప్పందం చేసుకుంది. అంటే… గుజరాత కంటే 59 పైసలు ఎక్కువ ధరకు.

మరి… ఇది చౌక విద్యుత్తు ఎలా అవుతుంది? ప్రజలపై భారం పడేలా మార్కెట్‌ రేటు కంటే ఎక్కువ ధరకు ఒప్పందం. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.1.25 లక్షల కోట్ల భారం పడుతుందని నిపుణుల అంచనా! ఐదేళ్ల పాలనలో అడుగడుగునా అదానీకి మేలు చేయడానికి నిస్సిగ్గుగా జగన్‌ ప్రయత్నించారు. కృష్ణపట్నం రేవును, గంగవరం రేవును దానికి కట్టబెట్టారు. వాటాలున్న కంపెనీల అధినేతలను బెదిరించి, భయపెట్టి వాటాలు అమ్ముకునేలా చేశారు. అదానీకి ప్రధాని మోదీ అండ ఉండడంతో జగన్‌ చెలరేగిపోయారు.


పేరుకు సెకీతో ఒప్పందం చేసుకున్నా.. విద్యుత సరఫరా చేసేది అదానీయే. వాస్తవానికి ఆంధ్రలోనే సౌర విద్యుత ప్లాంటు నిర్మిస్తే స్థానిక యువతకు ఉపాధి లభించేది. కానీ ఎక్కడో రాజస్థాన్‌లో ఏర్పాటుచేసిన ప్లాంటు నుంచి మన రాష్ట్రానికి విద్యుత సరఫరా చేయాలంటే పలు రాష్ట్రాల గుండా ట్రాన్స్‌మిషన్‌ లైన్లు వేయాలి. ఇప్పుడది కూడా పూర్తయింది. అదానీ నుంచి కరెంటు కొంటే వచ్చే పాతికేళ్లలో రూ.1.25 లక్షల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. దీని నుంచి ఎలా తప్పించుకోవాలా అని చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు.

మోదీకి సన్నిహితుడైన అదానీని కాదంటే ఏమవుతుందోనన్న ఆందోళన ఉండి ఉండొచ్చు. అలాగని రాష్ట్ర ప్రజలను తాకట్టుపెట్టలేరు కదా! అందుకే విద్యుత కొనాలని సెకీ పదే పదే లేఖలు రాస్తున్నా.. జవాబివ్వడం లేదు. అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు మినహాయిస్తేనే కొంటామని చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags
fake stories Jagan sakshi media SEKI agreements ycp
Recent Comments
Leave a Comment

Related News